ఘజియాబాద్: కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ చిక్కుల్లో పడ్డారు. దిల్లీలోని ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వద్ద సెక్యూరిటీ గార్డు మంత్రి వాహనాన్ని ఆపడంతో మంత్రి భద్రతా సిబ్బంది గార్డుపై చేయి చేసుకున్నారు. ఈ ఘట
న వివాదాస్పదంగా మారింది. నిన్న రక్షాబంధన్ సందర్భంగా మహేశ్ శర్మ దిల్లీలో తన సోదరి నివాసానికి వెళ్లారు. కాంప్లెక్స్ బయట సెక్యూరిటీ గార్డు కారు ఆపి మీరు ఏ ఇంటికి వెళ్లాలని ప్రశ్నించాడు. గేటు తెరవడానికి కేవలం రెండు నిమిషాలే పట్టింది.. ఈ లోపే మంత్రి భద్రత సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని, కొట్టారని భవనం సెక్యూరిటీ గార్డు వెల్లడించారు.
మంత్రి భద్రత సిబ్బంది సెక్యూరిటీ గార్డును కొట్టిన ఘటన కెమెరాకు చిక్కింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటన జరిగిన వెంటనే తాను క్షమాపణలు కోరానని.. తప్పు ఎవరిదో తెలియకముందే తాను గార్డును క్షమాపణలు కోరినట్లు మంత్రి మహేశ్ శర్మ ఈరోజు వెల్లడించారు. రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని వారు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. మంత్రి కారు వస్తోందని సెక్యూరిటీ గార్డుకు ముందస్తు సమాచారం ఇచ్చేందుకు ఎలాంటి పైలట్ కారు ముందు లేదని పోలీసులు వెల్లడించారు.




