Tuesday, 3 November 2026

విశ్వతయారీ కేంద్రంగా ఇండియా

C

– ప్రధాని మోదీ

ముంబయి,ఫిబ్రవరి 13(జనంసాక్షి): భారత్‌ అంతర్జాతీయ తయారీ కేంద్రంగా ఎదగాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించారు. ముంబయిలో నిర్వహిస్తున్న మేక్‌ ఇన్‌ ఇండియా వారోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విదేశీ పెట్టుబడులకు భారత్‌ అనుకూలమైన దేశమని స్పష్టం చేశారు. దేశంలో అధిక శాతం మంది యువతేనని… దేశాభివృద్ధిలో వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తాను ప్రధాని పదవి చేపట్టిన తర్వాతే ఎఫ్‌డీఐల వృద్ధి 48శాతం నమోదైనట్లు మోదీ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాటికి జీడీపీ వృద్ధి రేటు 7 శాతం దాటుతుందని పేర్కొన్నారు. విద్యుత్‌, బొగ్గు ఉత్పత్తిలో రికార్డు స్థాయిలో ప్రగతి సాధించినట్లు మోదీ తెలిపారు. కంపెనీల న్యాయ ట్రైబ్యునల్‌ ఏర్పాటు ప్రాథమిక స్థాయిలో ఉందని… దీనిలో ఐఎఫ్‌ఆర్‌, హక్కుల అంశాన్ని పొందుపరుస్తామన్నారు. ఇదిలావుండగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన విమర్శలపై ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. మన్మోహన్‌ సింగ్‌ను నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జైట్లీ కోరారు. యూపీఏ హయాంలో భారత్‌ ‘పాలసీ పక్షవాతం’ దశలో ఉందని దానిని అభివృద్ధి దిశలో తీసుకెళ్లేందుకు ఎన్డీయే ప్రయత్నిస్తోందని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పాలసీలు కాంగ్రెస్‌ హెడక్వార్టర్‌లో తయారయ్యేవని.. అప్పుడు పాలసీల విషయంలో మన్మోహన్‌ పార్టీకి ఏం సలహాలు ఇవ్వగలిగారు అని జైట్లీ ప్రశ్నించారు. ఎన్డీయే ప్రభుత్వంలో విధానాలు ప్రణాళికాబద్ధంగా తయారవుతున్నాయని, అయితే ఈ విషయంలో ప్రధాని మోదీదే చివరి నిర్ణయం అని అన్నారు. మన్మోహన్‌ ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ప్రభుత్వం భారత్‌ను ఆర్థికాభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలేదని, పెట్టుబడుల అవకాశాలు ఉపయోగించుకోవడం లేదని విమర్శించారు. దీనిపై భాజపా తీవ్రంగా స్పందిస్తోంది. యూపీఎ పాలనపై, మన్మోహన్‌పై విమర్శలు గుప్పిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *