Monday, 2 November 2026

విశ్వనగరంలో రియల్టర్లు భాగస్వామ్యంకండి

C

– సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,నవంబర్‌28(జనంసాక్షి):

రియల్‌ రంగంలోనూ పారదర్శకత అవసరమని సిఎం కెసిఆర్‌ అభిప్రాయపడ్డారు. రియల్‌ ఎస్టేట్‌రంగంలో పారదర్శకత కోసం టీఎస్‌ ఐపాస్‌ లాంటి చట్టం తేవాల్సిన అవసరం ఉందన్నారు.రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాభివృద్ధి సంఘాల సమాఖ్య నేతలు శనివారం  సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా అందులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులదే కీలక పాత్ర ఉంటుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తేవడంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కీలక పాత్ర పోషించాలని కోరారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులంతా సమాఖ్యగా ఏర్పడి ఓఆర్‌ఆర్‌ పరిసర ప్రాంతాల్లో మూడు నాలుగు వేల ఎకరాల్లో ప్రత్యేకంగా నగరాన్ని నిర్మించాలని సూచించారు. గ్రీన్‌ఫీల్డ్‌ ఆక్టివిటీ పెంచాలని సూచించారు.  రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తామని హావిూ ఇచ్చారు. బెంగళూరు నగరం కిక్కిరిసి పోతున్నందున సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు హైదరాబాద్‌కే తరలి వస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌ నగరం చుట్టు పక్కల హెల్త్‌, ఫార్మా, సినీ సిటీలు రాబోతున్నాయని అన్నారు.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బిజినెస్‌ ఎట్‌ ఈజ్‌ పద్ధతిలో జరగాలని తెలిపారు. ఆకాశహార్మ్యాల నిర్మాణంపై రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగర గమనాన్నిఅర్థం చేసుకుంటూనే ఇతర నగరాలను అధ్యయనం చేయాలని సూచించారు. భూముల లేఅవుట్లకు అనుమతులిచ్చే విషయంలో, నిబంధనలను పాటించే విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తామని తెలిపారు. రియల్‌ అభివృద్దికి తోడ్పాటును అందిస్తానన్నారు. అవినీతికి తావులేకుండా లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతులు ఉండాలని, దీనిపై కొత్త విధానం తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పేర్కొన్నారు. అనుమతులు సహా నిబంధనల పట్ల కచ్చితంగా వ్యవహరిస్తామని, ఎక్కడికక్కడ ప్లయింగ్‌ స్క్వాడ్‌ నిఘా ఉంటుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *