శ్రీముఖలింగేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు
శ్రీకాకుళం,నవంబర్6(జనంసాక్షి): కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. జిల్లాతోపాటు విజయనగరం, విశాఖపట్నం, ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వేలాదిమంది భక్తులు శ్రీముఖలింగేశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేశారు. దేవాదయ శాఖ ఏర్పాటు చేసిన టెంట్‌లు సరిపోక మండుటెండలో భక్తులు బారులు తీరారు. ఈవో వీవీ సూర్యనారాయణ, పాలకమండలి అధ్యక్షులు బలరాం, అర్చక సంఘం అధ్యక్షులు పెద్దలింగన్న, సర్పంచి మాణిక్యం తదితరులు ఆలయం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.