తెలంగాణ రాష్ట్ర తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అటు మండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2015-16 ఆర్థిక సంవత్సరం కోసం రూపొందించిన ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తయారు చేశారు. లక్షా 15 వేల 689 కోట్ల రూపాయల బడ్జెట్లో ప్రణాళికా వ్యయం 52 వేల 383 కోట్లు, ప్రణాళికేతర వ్యయం 63 వేల 306 కోట్లుగా చూపించారు. ఇక ఆర్థిక మిగులు 531 కోట్లుగా ఉంది. ద్రవ్యలోటు 16 వేల 969 కోట్లు గా అంచనా వేశారు. జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.49 శాతంగా చూపించారు. కేంద్రం నుంచి 12 వేల 823 కోట్లు పన్నుల రూపేనా రాష్ట్రానికి అందనుంది.
ఇక కేటాయింపుల విషయానికి వస్తే.. టీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్ని పథకాలకు బడ్జెట్లో సముచిత ప్రాధాన్యం లభించింది. అన్ని వర్గాల ప్రజలకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి తమ ప్రాధాన్య అంశాలన్న ఈటెల దానికి తగ్గట్లే బడ్జెట్ కేటాయింపులుచేశారు. దళితుల భూ పంపిణీకి 1000 కోట్లు, షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి 5547 కోట్లు కేటాయించారు. గిరిజన సంక్షేమానికి గతంలో ఎన్నడూ లేని విధంగా 2878 కోట్ల నిధులు కేటాయించారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌కు 8089 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ 5036 కోట్లు, బీసీ సంక్షేమానికి 2172 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 1105 కోట్లు కేటాయించారు. ఆసరా పెన్షన్ల కోసం 4000 కోట్లు, బీడీ కార్మికుల భృతి కోసం 188 కోట్ల రూపాయలిచ్చారు.
అంగన్వాడీ లపై బడ్జెట్ లో వరాల జల్లు కురిపించారు ఈటెల. అంగన్ వాడీ కార్యకర్తల నెల జీతాన్ని 4200 నుంచి ఒక్కసారిగా 7 వేలకు పెంచారు. అంగన్వాడీ సహాయకులకు 2450 నుంచి 4500 రూపాయలకు జీతాన్ని పెంచారు. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో వంటపాత్రల కొనుగోలు కోసం ప్రతీ కేంద్రానికి 1000 రూపాయలు కేటాయించారు. ఐసీడీఎస్ పథకానికి 771 కోట్లు కేటాయించారు. ఆహార భద్రత, సన్నబియ్యం పథకాల కోసం 2200 కోట్ల నిధులు కేటాయించారు.
ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ సర్కార్ గా ముద్రపడ్డ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇప్పటికే 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చింది. ఉద్యోగుల జీత భత్యాల కోసం బడ్జెట్ లో 22 వేల 889 కోట్లు నిధులు కేటాయించింది. రైతు సంక్షేమమే సమాజ సంక్షేమమని భావించే టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ కోసం ఈ బడ్జెట్ మరో 4250కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. గ్రీన్ హౌస్ సాగు కోసం మరో 250 కోట్లు, మైక్రో ఇరిగేషన్ కోసం మరో 200 కోట్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కోసం 411 కోట్ల నిధులను ప్రతిపాదించారు. మొత్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 8432 కోట్లు ప్రభుత్వం కేటాయించింది
ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధాన్ని అమలుచేస్తున్న టీఆర్ఎస్ సర్కార్.. ఇండస్ట్రియలిస్టులకు ఇప్పటికే ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇక ముచ్చర్ల దగ్గర 11 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం 973 కోట్ల 74 లక్షలు కేటాయించింది. రాష్ట్రంలో ఉన్న 19 లక్షల 53 వేల వ్యవసాయ పంపుసెట్లకు 7 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కిలోవాట్ సామర్థ్యం గల 4 వేల సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పుతామని వెల్లడించింది. 2018 సంవత్సరానికి 23, 675 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రకటించింది. విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు బడ్జెట్లో 7400 కోట్లు కేటాయించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం 8500 కోట్లు, మిషన్ కాకతీయ, చిన్న నీటి పారుదల శాఖకు 2083 కోట్ల రూపాయలు కేటాయస్తున్నట్లు ఈటెల ప్రకటించారు.
రోడ్లు, భవనాల శాఖ పరిధిలోకి వచ్చే రోడ్ల అభివృద్ధి కోసం 4980 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ రోడ్ల అభివృద్ధికి 2421 కోట్లు కేటాయించారు. వాటర్ గ్రిడ్ కోసం 4000 కోట్లు కేటాయించారు. 108 వాహనాల సంఖ్య 506 కు పెంచుతున్నట్లు ప్రకటించారు. వైద్య, ఆరోగ్య సేవల కోసం 4932 కోట్లు కేటాయించారు. ఇక విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తొలిసారి ఉస్మానియా యూనివర్సిటీకి 238 కోట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యాన, పశు వైద్య, వ్యవసాయ యూనివర్సిటీల అభివృద్ధికి 261 కోట్లు కేటాయించారు. మొత్తం మీద విద్యా రంగానికి 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను 11216 కోట్లు కేటాయించారు.
ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా ప్రారంభించిన హరిత హారం పథకం కోసం బడ్జెట్లో 325 కోట్లు కేటాయించారు. అటు బ్రాండ్ హైదరాబాద్ నిర్మాణంలో భాగంగా జీహెచ్ఎంసీకి 526 కోట్లు, హైదరాబాద్ మెట్రోరైలు కోసం 416 కోట్లు, హైదరాబాద్ వాటర్ అండ్ సీవరేజ్ బోర్డుకు 1000 కోట్లు కేటాయించారు. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి మరో వంద కోట్లు బడ్జెట్లో నిధులు కేటాయించారు.




