Monday, 2 November 2026

సభకు కేంద్రమంత్రి సాద్వి నిరంజన్‌ బేషరతు క్షమాపణలు

3

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్‌ ధర్నా

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 2 (జనంసాక్షి)  : లోక్‌సభకు కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి మంగళవారం క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను మోదీ ప్రభుత్వం అమలుచేయడంలేదని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పార్లమెంట్‌ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాధ్వీ నిరంజన్‌ జ్యోతి ‘రామరాజ్యం వైపు ఉంటారా? లేక అసాంఘిక శక్తుల వైపు ఉంటారో.. ఎటువైపుంటారో ఢిల్లీ ప్రజలే నిర్ణయించుకోవాలి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి నిరంజన జ్యోతి వ్యాఖ్యల వివాదాన్ని.. మంగళవారం కాంగ్రెస్‌ సభ్యులు లోక్‌సభలో లేవనెత్తారు. మంత్రి వ్యాఖ్యలు రెచ్చగొట్టే రీతిలో ఉన్నాయని మంత్రి సభకు క్షమాపణలతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.  ఈ అంశంపై తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే ఇదే అంశంపై కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించడంతో… కాంగ్రెస్‌ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. సమావేశాలకు అంతరాయం కలగటంతో స్పీకర్‌ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.  ఇదే అంశంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి వెంకయ్య నాయుడుతో చర్చలు జరిపారు. సభ తిరిగి ప్రారంభమైన తరువాత   సాధ్వీ నిరంజన్‌ జ్యోతి..సభకు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు ఉద్దేశ్యపూర్వకంగా చేసినవి కావని అన్నారు. తన మాటలు ఎవరికైనా ఇబ్బంది కలిగించివుంటే క్షమించాల్సిందిగా కోరారు. దీంతో వివాదానికి ముగింపు పలకాలని స్పీకర్‌ కాంగ్రెస్‌ సభ్యులకు సూచించారు.

రాహుల్‌ ఆధ్వర్యంలో ధర్నా : ఇచ్చిన  హావిూలు అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. మొత్తం 25 అంశాలపై మోదీ ప్రభుత్వం వెనకడుగువేసిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఎన్నికల తరువాత బీజేపీ యు టర్న్‌ తీసుకొందని ఇరు ఆరోపించారు. లోక్‌సభ సమావేశం ప్రారంభానికి కాంగ్రెస్‌ ఎంపీలంతా పార్లమెంట్‌ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు  రాహుల్‌ గాంధీ ఈ ధర్నాకు నాయకత్వం వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *