Monday, 2 November 2026

సముద్రం అడుగులో ఎయిర్‌ ఏషియా విమానం

శకలాల గుర్తింపు

జలాల్లో ఇంధన జాడ

3
జకార్తా,డిసెంబర్‌29(జనంసాక్షి):  ఇండోనేషియా నుంచి సింగపూర్‌ వెళ్తూ ఆదివారం ఉదయం అదృశ్యమైన ఎయిర్‌ఏషియాకు చెందిన విమాన శకలాలు సముద్రంలో గుర్తించినట్లు రెస్క్యూ అధికారులు వెల్లడించారు. నంగ్కా దీవికి వంద మైళ్ల దూరంలో అనుమానిత శకలాలు ఉన్నాయని.. అవి అదృశ్యమైన విమాన శకలాలేనా.. కాదా.. అన్నది తేలాల్సి ఉందని వారు పేర్కొన్నారు. సురబాయ నుంచి సింగపూర్‌ వెళ్తున్న ఎయిర్‌ ఏషియా విమానం తప్పి పోయిన ప్రాంతంలో దాని జాడలు కనిపించినట్లు సమాచారం. ఆ విమానం తప్పిపోయిందని భావిస్తున్న ప్రాంతలో ఇండోనేషియా హెలికాప్టర్‌ సముద్రంపై తేలియాడుతున్న చమురును గుర్తించింది. సోమవారం మధ్యాహ్నం చమురు తేలియాడుతున్న రెండు స్థలాలను అది కనుక్కొంది. వీటికి వంద మైళ్ళ దూరంలో తేలియాడుతున్న వస్తువులను ఆస్టేల్రియా విమానం గుర్తించింది. అయితే ఇవి తప్పిపోయిన విమానానికి చెందినవా, కావా అనేది గుర్తించాల్సి వుంది.

ఈ విమానంలో 155 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ఈ 162 మందిలో 149 మంది ఇండోనేషియాకు చెందినవారే. వాతావరణం అననుకూలంగా ఉందనీ, ప్రయాణ మార్గాన్ని మార్చుకోవడానికి అనుమతించాలని పైలట్లు కోరిన కాసేపటికే విమానంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఇప్పటికీ ఆచూకి దక్కకపోవడంతో ప్రయాణికుల బందువులు ఆందోళనకు గురవుతున్నారు. మలేషియా విమానం ప్రమాదానికి గురికావడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5.20 గంటలకు బయల్దేరిన ఈ విమానం 8.30 గంటలకు సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయానికి చేరుకోవాలి. జావా సముద్రం విూదుగా వెళ్తూ ఉదయం 7.24 గంటలకు సంబంధాలు కోల్పోయింది. దీంతో ఇప్పుడీ విమానం సముద్రంలో కూలిందా లేక, ఎవరైనా కూల్చివేశారా లేక ప్రతికూల వాతావరణంలో చిక్కుకుని కూలిపోయిందా అన్నది మిస్టరీగా మారింది. తక్కువ ధరతో సేవలందించడంలో పేరొందిన ఎయిర్‌ఏషియా దాదాపు వంద గమ్యస్థానాలకు విమానాలు నడిపిస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *