సాంకేతికత పేరుతో ఉపాధ్యాయులకు పనిభారం

ఏలూరు,నవంబర్‌11(జ‌నంసాక్షి): సాంకేతికత పేరుతో ఉపాధ్యాయులకు పనిభారం పెంచితే బోధన కుంటుపడుతుందని పీఆర్‌టీయూ నేతలు అన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో సీసీఈ విధానాన్ని అనుసరించడంవల్ల విద్యార్థులపై ఆర్థికభారం పడుతోందన్నారు. ఏకీకృత సర్వీసు నిబంధనలకు ఆమోదంతో రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న మండల, ఉపవిద్యాశాఖాధికారుల కొలువులు, డైట్‌ అధ్యాపకుల కొలువులు, జూనియర్‌ అధ్యాపకుల కొలువులు రెగ్యులర్‌ ప్రాతిపతికన భర్తీ చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ఎంఈవో కొలువులు ఖాళీగా ఉన్నాయని, అర్హత కలిగిన ప్రధానోపాధ్యాయులకు ఎంఈవోలుగా పదోన్న తులు కల్పించే దస్త్రం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. బీఈడీ, టెట్‌, డీఎస్సీ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించినవారికి సామర్థ్య పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వ ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. అవసరమైతే ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించుకోవాలే తప్ప ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇలాంటి పరీక్షల నిర్వహణ సరికాదన్నారు. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలు ఇవ్వడంలో తప్పులేదుకానీ, సామర్థ్య పరీక్షలు నిర్వహించి గ్రేడింగులు ఇవ్వాలనుకోవడం సహేతుకం కాదని పేర్కొన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగ అభివృద్ధికి వినియోగించడం మంచి పద్ధతే అయినప్పటికీ ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించడం సరికాదన్నారు.

తాజావార్తలు