Monday, 2 November 2026

సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి చూపుతాం

y8gawbfcకోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తాం

తెలంగాణ రైతాంగం కన్నీళ్లు తుడుస్తాం

మహారాష్ట్ర, కర్నాటకలతో తెలుగు రాష్టాల్రకునీటి ముప్పు

అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి): తెలంగాణ రైతాంగం ఆశగా ఎదురుచూస్తున్న సాగునీటి ప్రాజెక్టులను కట్టి తీరుతాం.. కోటి ఎకరాలకు నీళ్లందిస్తాం.. రైతుల కన్నీళ్లు తుడుస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ తెచ్చకున్నదే సాగునీటిని సంపూర్ణంగా వినియోగించుకోవాలన్న లక్ష్యమన్నారు. నీటి పంపకంలో ఇన్నాళ్లు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసేందుకే అసెంబ్లీలో జల విధానంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఏర్పాటు చేసినట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై శాసనసభలో ఆయన సమగ్ర వివరణ ఇచ్చారు. ప్రాజెక్టుల పునరాకృతి, కొత్త పథకాల రూపకల్పనపై సభ్యులకు వివరణ ఇచ్చారు. గోదావరి, కృష్ణా నది జలాల్లో తెలంగాణకు రావాల్సిన కోటాను సీఎం అసెంబ్లీ వేదికగా స్పష్టంగా వివరించారు. వాటర్‌ షెడ్‌కు కాకతీయులే ఆదర్శంగా నిలిచారన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక ద్వారా రెండు తెలుగు రాష్టాల్రకు ముప్పుందన్నారు. దాదాపు 400కు పైగా ప్రాజెక్టుఉల కట్టారని అన్నారు. ఇప్పుడు వాటి గురించి ఆలోచించకుండా ముందుకు సాగాలన్నదే తమలక్ష్యమన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సింగూరు ఎండిపోయి అందులో ఉన్న మొసళ్లు బయటకొస్తున్నాయని తెలిపారు. అనేక విషయాలు అవగాహన చేసుకున్న తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చామని స్పష్టం చేశారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృత మైందని సీఎంఅన్నారు. తెలంగాణ నీటి కష్టాలు తీర్చమని కృష్ణమ్మ, గోదావరి తల్లిని మొక్కని సందర్బంలేదని తెలిపారు. కృష్ణమ్మ, గోదావరి తల్లి ఒడిలో తాను వేసినన్ని పైసలు  ఎవరూ వేసి ఉండరని గుర్తు చేశారు. గోదావరి, కృష్ణా నదులపై నుంచి వెళ్తున్నపుడు నదుల్లో కాయిన్లు వేసి తల్లీ మా నీటి కష్టాలు ఇంకెన్నాళ్లమ్మా? ఎన్నడు మా నీటి వెతలు తీర్చుతావని మొక్కుకునే వాడినని గుర్తు చేశారు. తనతోపాటు వచ్చిన ఉద్యమకారులు కూడా నదిలో పైసలు వేసి మొక్కిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణను ప్రస్తుతం వేధిస్తున్న ప్రధాన సమస్య నీటి కొరతేనని కేసీఆర్‌ అన్నారు. నీటి అంశంలో గత ప్రభుత్వాలు తెలంగాణపై పూర్తి వివక్షతో వ్యవహరించాయన్నారు. 1956 నాటికే తెలంగాణలో నీటి పారుదల వ్యవస్థ సమగ్రంగా ఉందని గుర్తు చేశారు. వాటర్‌ షెడ్‌ అంటే ఏంటో కాకతీయ రెడ్డి రాజులు ప్రపంచానికి చాటి చెప్పారు అని తెలిపారు. కులీ కుతుబ్‌ రాజులు యుద్ధానికి

వెళ్లిన సందర్భంలో నౌబత్‌ పహాడ్‌ ఎక్కితే హుసేన్‌సాగర్‌ అనే సరస్సు కనిపించిందన్నారు. 1500వ సంవత్సరంలో కుతుబ్‌ షాహీలు హుస్సేన్‌ సాగర్‌ను కట్టించారని పేర్కొన్నారు. 11వ శతాబ్ధంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరలేదని తెలిపారు. ప్రపంచంలో మొట్ట మొదటి మేజర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిజాం సాగర్‌ ప్రాజెక్టు అని చెప్పారు. అసఫ్‌ జాహీలు ఎన్నో విూడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టులు కట్టించారని గుర్తు చేశారు. దుమ్ముగూడెం టెయిల్‌ పాండ్‌ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఒరిగేందేవిూ లేదన్నారు.

పాలమూరు ఎత్తిపోతలను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టి తీరుతామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇవాళ అసెంబ్లీలో జల విధానంపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ సందర్భంగా ఆయన ప్రసంగించారు. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకునేందుకు మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలే హైకోర్టులో పిల్‌ వేశారని గుర్తు చేశారు. హైకోర్టు దానిని కొట్టివేసి ప్రాజెక్టును కట్టేందుకు అనుమతించిందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టును కట్టి తీరుతామన్నారు. ఆకుపచ్చ, హరిత తెలంగాణ సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇన్ని ఆటంకాలు సృష్టించినా, అవరోధాలు కల్పించినా కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామని గంటాపథంగా చెప్పారు. తప్పకుండా సాగునీరు తెస్తాం, తెలంగాణ రైతు కన్నీళ్లు తుడుస్తామని పేర్కొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో చెరువులన్నీ ధ్వంసం

ఉమ్మడి రాష్ట్రంలో చెరువులన్నీ ధ్వంసమై పోయాయని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కోటీ 11 లక్షల కోటీ ఎకరాల సాగు భూమి ఉన్నప్పటికీ సరిపడనంతా నీరు పారలేదు. చాలా వరకు భూములన్నీ బీడుగానే ఉన్నాయన్నారు.  తెలంగాణ ప్రాజెక్టు అనగానే అంతర్‌ రాష్ట్ర వివాదాలు.. లేకుంటే పర్యావరణ సమస్యలు ఉండేవన్నారు. తెలంగాణ నీటి కేటాయింపులు ఫైళ్ల విూద స్పష్టంగా ఉన్నాయన్నారు. జూరాల కడితే నీళ్లు నింపుకోలేని పరిస్థితి, ఆనాడు రాజోలిబండకు బాంబులు పెట్టి నీళ్లు మళ్లించుకున్నారని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో వివక్షతతోనే తెలంగాణ ఉద్యమం పుట్టిందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని, చెరువులన్నీ అంతరించుకుపోయాన్నారు. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం వల్ల వర్షపాతం తగ్గిందన్నారు. కాకతీయులు, రెడ్డిరాజులు తెలంగాణలో నీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేశారని… వారి స్ఫూర్తిని కులీకుతుబ్‌షా కొనసాగించారని తెలిపారు. కాకతీయులు 75వేలకు పైగా చెరువులను నిర్మిస్తే… కులీకుతుబ్‌షా హుస్సేన్‌సాగర్‌ నిర్మించినట్లు తెలిపారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదటి మేజర్‌ ప్రాజెక్టని వెల్లడించారు. స్వాతంత్య్రం రాక ముందు తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్‌ ధనిక జిల్లాగా ఉండేదని… సమైక్య పాలనలో ఆ జిల్లా వెనుకబడిన జిల్లాగా మారిపోయిందన్నారు.

మహారాష్ట్ర ప్రాజెక్టులతో ముప్పే

మహారాష్ట్ర, కర్ణాటక రాష్టాల్రు  నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని కేసీఆర్‌ తెలిపారు. ఆ రెండు రాష్టాల్రు  కృష్ణా, గోదావరి నదులపై సుమారు 450 ప్రాజెక్టులు కట్టాయని… దీంతో తెలంగాణలోని సింగూరు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులకు చుక్కనీరు కూడా రావడం లేదన్నారు. దీనిపై ప్రశ్నిస్తే తమ పరిధి మేరకే ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నామని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని పేర్కొన్నారు. నీటి అంశంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలిసేలా చేయడమే తమ ప్రయత్నం ఉద్దేశమని స్పష్టం చేశారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించి తెలంగాణ రైతన్నల కన్నీరు తుడవడమే తమ ప్రధాన లక్ష్యమని కేసీఆర్‌ ప్రకటించారు. గోదావరి, కృష్ణ, వాటి

ఉనదులపై మహారాష్ట్ర నిర్మిస్తున్న ప్రాజెక్టులతో తెలంగాణ, ఆంధప్రదేశ్‌ లకు ముప్పేనని కేసీఆర్‌ తెలిపారు. పెన్‌గంగపై ఆ రాష్ట్రం 31 ప్రాజెక్టులు కట్టిందని… మరో 9 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయన్నారు. వీటితో 1300 టీఎంసీల నీరు తెలంగాణకు రాకుండా ఆగిపోతోందన్నారు. ప్రతి నదిపై ఇబ్బడిముబ్బడిగా బ్యారేజీలు, లిఫ్టులు కట్టేశారని.. వీటి సాయంతో నీటిని తరలించుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండిన తర్వాతే తెలంగాణకు నీళ్లొచ్చే పరిస్థితి తలెత్తిందన్నారు. మంజీరా, ఎస్సారెస్సీ, శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి చుక్కనీరు రాకపోవడానికి ఇబ్బడిముబ్బడిగా కడుతున్న ప్రాజెక్టులే కారణమని స్పష్టం చేశారు. వీటన్నింటిపైనా ప్రశ్నిస్తే చివరకి మిగిలేవి వివాదాలేనని కేసీఆర్‌ స్పష్టం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *