Tuesday, 3 November 2026

సాథ్వి రాజీనామా చేయాల్సిందే

6

ఉభయ సభల్లో ప్రతిష్టంభన

విపక్షాల ఆందోళన

క్షమాపణలను అంగీకరించండి : మోడీ

న్యూఢిల్లీ, డిసెంబర్‌5 (జనంసాక్షి) : కేంద్ర మంత్రి సాథ్వి నిరంజన్‌ జ్యోతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె రాజీనామా చేయాలని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ విషయమై ప్రభుత్వానికి ఉభయ సభల్లోనూ ప్రతిష్టంభన ఎదురైంది. ఈ నేపథ్యంలో.. మంత్రి తన పొరపాటును గర్తించి సభకు క్షమాపణ చెప్పారని, ఆమె క్షమాపణలు అంగీకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలను కోరారు. క్షమాపణలు కోరిన దృష్ట్యా ఈ విషయంలో వివాదం చేయాల్సిన అవసరం లేదన్నారు. సభ నిర్వహణకు విపక్షాలు సహకరించాలని కోరారు. అనేక ముఖ్య అంశాలపై సభలో చర్చ జరగాల్సి ఉందన్నారు. ప్రధాని వివరణకు విపక్షాలు సంతృప్తి చెందలేదు. మంత్రి రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఉభయసభల్లో ఆందోళనకు దిగారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. శుక్రవారం   పార్లమెంట్‌ సమావేశాలు  ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే కేంద్రమంత్రి సాథ్వి నిరంజన్‌ జ్యోతి వ్యాఖ్యలపై విపక్షాలు తమ ఆందోళనను కొనసాగించాయి. దీంతో ప్రధాని నరేంద్రమోదీ సాథ్వి వ్యాఖ్యలపై లోక్‌పభలో వివరణ ఇచ్చారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ… సాథ్విపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. సాథ్వి వ్యాఖ్యలపై ప్రధాని వివరణ ఇచ్చారు. గురువారం కూడా ప్రధాని సభను కోరారని ఇంతటితో ముగింపు పలకాలని ఆయన కోరారు. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనేక ప్రజా సమస్యలను సభలో చర్చించాల్సి ఉందన్నారు. అనంతరం లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సాథ్వి వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం కూడా పార్లమెంట్‌ వెలుపల విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. దీంతో డిప్యూటీ  ఛైర్మన్‌ రాజ్యసభను పలుమార్లు వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *