సాయి ఆస్పత్రిలో మెరుగైన సేవలు
అనంతపురం,జూలై31(జనం సాక్షి): పుట్టపర్తి సత్యసాయి ఆస్పత్రిలో నిరుపేద రోగులకు ప్రేమతో ఆధునిక వైద్యసేవలందిస్తున్నామని ట్రస్ట్ నిర్వాహకులు ప్రకటించారు. ఇందులో ఎలాంటి అవరోధాలు లేవన్నారు. ఆసుపత్రిలో ఏళ్లుగా వివిధ విభాగాల ద్వారా లక్షల మంది రోగులకు కోట్లాది రూపాయలు విలువగల వైద్యసేవలందించామన్నారు. వైద్యసేవలలో ఎలాంటి అవరోధాలు ఎదురు కాకుండా సత్యసాయి వెన్నంటివుండి నడిపిస్తున్నారన్నారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సత్యసాయి జనరల్ ఆసుపత్రిని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోకి విలీనం చేశామన్నారు. సత్యసాయి ఆశయసాధనలో భాగస్వాములైనందుకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సత్యసాయి మానవాళికి అందిస్తున్న వైద్య, సామాజిక సేవలను విస్తరిస్తున్నామని తెలిపారు.