Tuesday, 3 November 2026

”సిడ్నీి కేఫ్‌” ఆపరేషన్‌ సక్సెస్‌

2

బందీలను విడిపించిన కమాండోలు

భారతీయులు సేఫ్‌ – సుష్మా స్వరాజ్‌

 

సిడ్నీ:,డిసెంబర్‌15(జనంసాక్షి): ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ నగరంలో ఉగ్రవాది నుంచి బందీలను విడిపించేందుకు కమాండోలు చేపట్టిన ఆపరేషన్‌ విజయవంతంగా ముగిసిందని పోలీసులు ప్రకటించారు. ఈ సంఘటన ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగింది. ‘ఐఎస్‌ఐఎస్‌’ ఉగ్రవాదిగా అనుమానిస్తున్న ఒక సాయుధుడైన దుండగుడు సుమారు 30 మందిని నగరంలోని లిండ్‌ కేఫ్‌లో నిర్బంధించి వారి విడుదలకు పలు డిమాండ్లు విధించాడు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గుంటూరు జిల్లా వాసి విశ్వకాంత్‌ అంకిరెడ్డి అనే యువ ఇంజినీర్‌ సురక్షితంగా బయటపడ్డాడు. సిడ్నీలోని మార్టిన్‌ప్లేస్‌లో ఉన్న లిండ్‌ చాక్లెట్‌ కేఫ్‌లో దుండగుడు 30 మందిని బంధించగా, తొలుత ఉగ్రవాది చెర నుంచి ఐదుగురు తప్పించుకుని బయటపడ్డారు. ఉగ్రవాది విషయం తెలుసుకున్న న్యూసౌత్‌వేల్స్‌ పోలీసులు కేఫ్‌ను చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ పరిసరాల్లోని బ్యాంకులు, కార్యాలయాలు, ఇతరత్రా అన్నింటినీ మూసివేయించారు. సమీపంలో ఉన్న ఇళ్ల నుంచి ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. అరబిక్‌ భాషలో రాసివున్న నల్లజెండాను కిటికీ నుంచి ప్రదర్శించడం టెలివిజన్‌ ఛానెళ్లు ప్రసారం చేశాయి. అయితే అది ఏ దేశానికి సంబంధించినదీ కాదని అధికార వర్గాలు తెలిపాయి. ఒక దుండగుడు మాత్రమే ఈ చర్యకు పాల్పడినట్లు న్యూసౌత్‌ వేల్స్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆండ్రూ స్పష్టం చేశారు. ఘటన నేపథ్యంలో సిడ్నీలో గగనతల ట్రాఫిక్‌ను అధికారులు నియంత్రించారు. పలు విమానాలను దారి మళ్లించినట్లు ఉప ప్రధాని వారెన్‌ ట్రస్‌ విలేకరులకు తెలిపారు. అదే విధంగా ఆ ప్రాంతంలోని రహదారులను, రైలు మార్గాలను పూర్తిగా మూసేశారు. బందీలను బయటకు తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 16 గంటల అనంతరం కమాండో ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు. బందీలుగా ఉన్నవారిని బయటకు తెచ్చేందుకు పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. బందీలుగా ఉన్న 12 మందిని పోలీసులు బయటకు తీసుకువచ్చారు. ఈ ఆపరేషన్‌లో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను పారామెడికల్‌ సిబ్బంది హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. బందీలుగా వున్న ఇద్దరు భారతీయులు విశ్వకాంత్‌, పుష్పేందుఘోష్‌లు సురక్షితంగా బయటపడ్డారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *