హైదరాబాద్ : ప్రముఖ సినీ రచయిత, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి (61) కన్నుమూశారు. సోమవారం తెల్లవారుఝామున చెన్నైలోని ఆయన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దాదాపు 90 సినిమాలకు పైగా రచయితగా పనిచేసిన సత్యమూర్తి మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు. ‘దేవత’, ‘చంటి’, ‘ఛాలెంజ్’, ‘భలేదొంగ’ వంటి సినిమాలకు సత్యమూర్తే రచయిత. తన కుమారుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా రాణించడానికి సత్యమూర్తి ప్రోత్సాహం ఎంతో వుంది. కొద్ది సంవత్సరాల క్రితం పక్షవాతానికి గురైన సత్యమూర్తిని అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. సత్యమూర్తి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. తన కుమారుడిని సినీ హీరోగా చూడాలన్నది సత్యమూర్తి కోరిక. ఆ కోరిక నెరవేరబోయే తరుణంలో సత్యమూర్తి కన్నుమూశారు. చెన్నైలోనే సత్యమూర్తి అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు దేవి శ్రీ ప్రసాద్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
సినీరచయిత , దేవీశ్రీ ప్రసాద్‌తండ్రి కన్నుమూత




