
నాలుగు రోజులు బస చేసిన మొదటి ముఖ్యమంత్రిని నేనే..
పింఛన్ల పంపిణీ, పక్కా ఇళ్లకు శంకుస్థాపన
ఫీజు రీఎంబర్స్మెంట్పై భరోసా
హైదరాబాద్, జనవరి11(జనంసాక్షి) : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వరంగల్లో నాలుగు రోజుల పర్యటన విజయవంతం అయింది. అక్కడే నాలుగు రోజులు కేసీఆర్ బస చేశారు. స్వయంగా కాలనీ వాసుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. పెద ప్రజలకు అత్యవసరమైన ఇళ్లు, ఫించన్లు, రేషన్ కార్డులు మూడు నెలలో అందిస్తామనీ హామీ ఇచ్చారు. ఈసందర్భంగా ఆదివారం కేసీఆర్ లక్ష్మిపురం కాలనీలో పేదల గృహ నిర్మాణ సముదాయానికి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ… వరంగల్ నగరం తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమని పేర్కొన్నారు. అయినా ఈ నగరం సీమాంధ్రుల పాలనలో అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నగరంలో ఎన్నో మురికి వాడలు ఉన్నాయని ఈ మూడు రోజుల్లో తాను తొమ్మిది మురికి వాడలను సందర్శించానని తెలిపారు. ఇంకా చాలా మురికి వాడలు ఉన్నాయని, ఇంకా వీటికన్నా చాలా అధ్వాన్నంగా ఉన్న బస్తీలు కూడా ఉన్నాయన్నారు. వాటిని ఎంపీ, అధికారులు కలిసి పరిశీలిస్తారని అన్నారు. ఈ మురికి వాడల్లో ఏ ఒక్కరికి సరియైన ఇండ్లు లేవని ఆవేదనతో చెప్పారు. ప్రతీ పేదవాడికి ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, పేదలు ఒక్క పైస కూడా చెల్లించనవసరం లేదని వివరించారు. పేదల నివాసాల కోసం ఇవాళ రూ.400 కోట్లు మంజూరు చేస్తున్నానని వీటితో ఆరు కాలనీల్లో 3,957 ఇండ్లను నిర్మించి ఇస్తామని వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టే పనులకు ప్రజలు సహకరించాలని కోరారు.ప్రభుత్వ పథకాలు ప్రతీ పేదవాడికి అందుతాయని ఓపికగా ఉండాలని కోరారు. గత 60 ఏళ్ల నుంచి మూలనపడ్డ అభివృద్ధి రాత్రికి రాత్రి జరగదని అన్నారు. ఈమేరకు తాను అధికారులు నేతలో కలిసి నిన్న రాత్రంతా చర్చలు జరిపానని తెలిపారు.
ఐదు నగరాల అభివృద్ధికి నేనే ఇన్ఛార్జీని: సీఎం
రాష్ట్రంలోని ఐదు నగరాల అభివృద్ధికి తానే ఇన్ఛార్జీనని కేసీఆర్ స్పష్టం చేశారు. అందుకే ఇక్కడే ఉండి సమస్యలను పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఇవాళ వరంగల్లో ఆయన మాట్లాడారు. వరంగల్ నగరం ఎన్నో సమస్యల వలయంలో చిక్కుకుని ఉందని ఆవేదనతో అన్నారు. తొమ్మిది బస్తీల్లోని పేదలకు రూ.400 కోట్లతో 3,957 ఇండ్లు నిర్మించేందుకు నిర్ణయించామన్నారు. ఇందు కోసం తొలి విడతగా రూ.100 కోట్లు తక్షణమే విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఐదు నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు.వాటర్ గ్రిడ్ పథకం ద్వారా అందరికీ మంచినీళ్లు సరఫరా చేస్తామన్నారు. నగరంలోని ఎంజీఎం ఆస్పత్రి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాల్సి ఉందని పేర్కొన్నారు. నగరంలో తాను పర్యటించిన 9 మురికి వాడల్లో 420 మందికి పెన్షన్లు అందజేశామన్నారు. వరంగల్ రోడ్లను విస్తరింపజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.




