సీఎం కేసీఆర్ చైనా టూర్ కు సర్వం సిద్ధమైంది. వచ్చే నెల 8 నుంచి 15 వరకు ఆయన అధికారుల బృందంతో కలిసి చైనాలో పర్యటించనున్నారు. సీఎంతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలు చైనాలో పర్యటించనున్నారు.అక్కడ జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొననున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే నెల 8 నుంచి 15 వరకు చైనాలో పర్యటించనున్నారు. అక్కడ జరుగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశాల్లో పాల్గొనాలని ప్రత్యేకంగా ఆహ్వానం అందటంతో సీఎం చైనా పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలగురించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం ప్రస్తావించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సింగిల్ విండో విధానం గురించి సీఎం.. చైనా పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు.
రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, చేపడుతున్న అభివృద్ధి పనులకు ముగ్ధుడైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ ఫలిప్ రోస్లర్.. వాటి గురించి వివరించేందుకు ఫోరం సమావేశాలకు రావాలని గత నెల 29న సీఎం కేసీఆర్‌కు ఆహ్వా నం పంపారు. ముందుచూపుతో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలు, ముఖ్యంగా నూతన పారిశ్రామిక విధానం ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని… రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, లక్ష్యాలు, అందుకు ఎంచుకున్న మార్గాల గురించి వివరించేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి రావాలని రోస్లర్ లేఖలో కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చైనాలో జరుపనున్న పర్యటనకు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు కూడా వెళ్లనున్నారు. సీఎంతోపాటు చైనా పర్యటనకు వెళ్లనున్న పారిశ్రామికవేత్తల బృందంలో మైహోం చైర్మన్ రామేశ్వర్రావు, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, జీఎమ్మార్ ప్రతినిధులు, హెటిరో ల్యాబ్స్, రెడ్డిల్యాబ్స్ ప్రతినిధులు, నాస్కాం చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డితోపాటు పలువురు పారిశ్రామివేత్తలు ఉన్నట్టు సమాచారం. సదుస్సుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నందున వీలైనంత ఎక్కువమందితో వీరు ఇంట్రాక్షన్ అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతోపాటు చైనాలో ఇప్పటికే విజయపథంలో ఉన్న పారిశ్రామిక రంగాలపై అధ్యయనం చేయనున్నారు.
పారిశ్రామికవేత్తల బృందం చైనాలోని పారిశ్రామిక పార్కులను, సెజ్‌లను సందర్శించనుంది. అక్కడి పరిస్థితులు, సమస్యలు, స్థితిగతులను ప్రత్యక్షంగా తెలుసుకోనుంది. చైనాలోని నూతన పారిశ్రామిక విధానాలను తెలుసుకొనేందుకు స్థానిక పరిశ్రమలశాఖ అధికారులతోనూ సమావేశాలు నిర్వహించనుంది. వీటితోపాటు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానంపై, దాని అమలుతో తెలంగాణలో వెల్లువెత్తుతున్న పెట్టుబడులపై అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. చైనాలో విజయవంతంగా అవలంబిస్తున్న పారిశ్రామిక విధానాలను మన రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా ప్రవేశపెట్టేందుకు ఉన్న అవకాశాలపై పారిశ్రామికవేత్తల బృందం అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది.
సీఎం కేసీఆర్ చైనా టూర్ కు సర్వం సిద్ధమైంది




