న్యూఢిల్లీ, డిసెంబర్ 3 (జనంసాక్షి) : 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అనిల్‌కుమార్ సిన్హా సీబీఐ నూతన డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కర్తవ్య నిర్వహణలో ఎదురైయ్యే సవాళ్ల పట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉంటానని సిన్హా అన్నారు. సీబీఐ నైతిక నిష్ఠను కాపాడేందుకు కృషిచేస్తానని పేర్కొన్నారు. సీబీఐ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వృత్తిపరంగా ఎదురయ్యే సవాళ్లను దీటుగా ఎదుర్కొంటానని చెప్పారు. అందరి సహకారం తనకి కావాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం అనికుమార్ సిన్హాను సీబీఐ డైరెక్టర్ పదవికి ఎంపిక చేసింది. ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మ కాన్ని వమ్ము చేయనని, పూర్తిస్థాయిలో పనిచేస్తానని ఆయన వెల్లడించారు. సంస్థ పనితీరుపై సుప్రీంకోర్టు సహా వివిధ సంస్థల నుంచి అసంతృప్తి ఉన్న నేపథ్యంలో విశ్వసనీయతను పునరుద్ధరించుకోవడం ఆయన ముందున్న ప్రధాన లక్ష్యం. 58 ఏళ్ల సిన్హా- గత 21 నెలలుగా సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా ఉన్నారు. శారదా గ్రూపు సంస్థల కుంభకోణ దర్యాప్తును ఆయనే పర్యవేక్షించారు. సీబీఐ అధిపతిగా వరసగా మూడోసారి బిహార్‌కు చెందిన అధికారే బాధ్యతలు చేపట్టడం విశేషం. ఇదివరకు డైరెక్టర్లుగా వ్యవహరించిన రంజిత్‌సిన్హా, ఎ.పి.సింగ్ కూడా ఆ రాష్గానికి చెందినవారే. ప్రతిష్ఠాత్మకమైన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న అనిల్‌కుమార్ సిన్హా విలేకరులతో మాట్లాడుతూ సవాళ్లన్నీ మంచి చేయడానికి అవకాశం కల్పించేవేనని చెప్పారు. ప్రతిష్ఠాత్మకమైన దర్యాప్తు సంస్థకు అధిపతిగా వ్యవహరించే బాధ్యతను వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు చెప్పారు. సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు తనకు తెలుసుననీ, తన బృందంతో కలిసి విలువల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. ఆయన గతంలో రాష్ట్రపతి పోలీసు పతకాన్ని దక్కించుకున్నారు. సిన్హా బిహార్‌లోని ముఖ్యమైన జిల్లాల్లో 18ఏళ్లపాటు ఎస్పీగా సేవలందించడంతో పాటు ప్రత్యేక విభాగం డి.ఐ.జి.గానూ పనిచేశారు. కేంద్ర సేవలకు వెళ్లి ప్రత్యేక రక్షణ బృందం (ఎస్పీజీ) డి.ఐ.జి.గా, ఐ.జి.గా సేవలందించారు. 2005లో తిరిగి బిహార్‌కు అదనపు డైరెక్టర్ జనరల్‌గా వెళ్లారు. 2010లో కేంద్ర నిఘా కమిషన్‌కు అదనపు కార్యదర్శిగా మరోసారి కేంద్ర సేవల్లోకి వెళ్లారు. 2013 మే నుంచి సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా ఉన్నారు.
సీబీఐ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరణ





