Tuesday, 3 November 2026

సీబీఐ దాడులపై రాజ్యసభ గరంగరం

C
న్యూఢిల్లీ,డిసెంబర్‌15(జనంసాక్షి): ఢిల్లీ సచివాలయంలో సీబీఐ సోదాలు జరిపిందన్న వ్యవహారం పార్లమెంటును ఓ కుదుపు కుదిపింది. దీనిపై రాజ్యసభలో తీవ్ర దుమారం చెలరేగింది. తమకు వ్యతిరేకంగా ఉన్నారన్న కారణంగా ఆప్‌పై వేధింపులకు పాల్పడుతూ ఇప్పుడు సిబిఐని ప్రయోగించారని అన్నారు. దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తీవ్రంగా స్పందించారు. కేజ్రీవాల్‌ కార్యాలయంపై సిబై దాడులుజరగలేదన్నారు. ఇదంతా ఓ అబద్దపు ప్రచారమన్నారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే చర్యని అన్నారు. ఎలాంటి దాడులు జరగలేదన్నారు. డిప్యూటి ఛైర్మన్‌ కురియన్‌ కూడా మంత్రి వ్యాఖ్యలపై స్పందించారు. దీనిపై మంత్రి వివరణ ఇచ్చారు కనుకక సభ్యులు ఆందోళన చేయడం తగదన్నారు. అయినా సభ్యులు నినాదాలు చేస్తూ పోడియం వద్దకు దూసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో డిప్యూటి ఛైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధం లేని విషయాలపై అనవసర రాద్దాంతం తగదన్నారు. దీనిని అంగీకరించబోమన్నారు. జైట్లీ పదేపదే సిబై దాడులు జరగలేదన్నా, సభ్యులు ఆందోళన విరమించలేదు. దీంతో కురియన్‌ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఇదిలావుంటే సిబిఐ దాడులకు సంబంధించి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ చేసిన ఆరోపణలను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. కేంద్రంతో కయ్యాలు దిల్లీ సీఎంకు పరిపాటిగా మారాయని విమర్శించారు. ప్రతి వివాదంలో ప్రధానిని లాగడం కేజీవ్రాల్‌కు అలవాటుగా మారిందన్నారు. సీబీఐ… ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసే సంస్థ కాదని స్పష్టం చేశారు. పదే పదే కేందప్రభుత్వంతో కొట్లాడటం, ప్రతి విషయానికీ ప్రధానమంత్రి పేరు ప్రస్తావించడం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌కు ఫ్యాషనై పోయిందని వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ఢిల్లీ సచివాలయంలో ముఖ్యకార్యదర్శి రాజేంద్రకుమార్‌ కార్యాలయంలో సీబీఐ సోదాలు జరగడం.. దానిపై ప్రధానిని విమర్శిస్తూ కేజీవ్రాల్‌ ట్వీట్‌ చేయడంతో వెంకయ్యనాయుడు స్పందించారు. సీబీఐ ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో పనిచేయడంలేదని, అలా పనిచేసే రోజులు కాంగ్రెస్‌తోనే పోయాయని ఆయన అన్నారు. ఇప్పుడు సీబీఐ ఒక స్వతంత్ర సంస్థ అని, ప్రభుత్వం అందులో ఏమాత్రం జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. అసలు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని ఎలా విమర్శిస్తారని కేజీవ్రాల్‌ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంతో ప్రధానికి ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రికి ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న రాజేంద్ర కుమార్‌ విూద తాము కేసు నమోదు చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు వివరించాయి. గత కొన్నేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వ శాఖలకు చెందిన టెండర్లన్నింటినీ ఒకే సంస్థకు కేటాయించడం ద్వారా వాళ్లకు ప్రయోజనం చేకూరుస్తున్నారని, దీనిపై తాము వారంట్లు తీసుకుని ఆయన కార్యాలయం, ఇళ్లపై సోదాలు చేస్తున్నామని సీబీఐ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *