Tuesday, 3 November 2026

సీబీఐ స్వయం ప్రతిపత్తిపై సుప్రీంకు అఫిడవిట్‌

న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి) :
‘పంజరంలో బందీ’ అయిన సీబీఐకి విముక్తి కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర దర్యాప్తు సంస్థకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు కేంద్రం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. 41 పేజీల అఫిడవిట్‌లో సీబీఐ ప్రతిపత్తికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కేంద్ర మంత్రుల బృందం చేసిన సిఫార్సులను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అఫిడవిట్‌లో పలు అంశాలను పేర్కొంది. సీబీఐ డైరెక్టర్‌ నియామకానికి ప్రత్యేక కమిటీ (కొలిజియం) ఏర్పాటు చేయనుననట్లు కేంద్రం తెలిపింది. ఈ కొలీజియంలో ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటారని పేర్కొంది. అలాగే, డైరెక్టర్‌ తొలగింపు అధికారం పూర్తిగా రాష్ట్రపతికే ఉంటుందని కోర్టుకు తెలిపింది. అలాగే, దర్యాప్తు సంస్థ చేపట్టే అంశంలోనూ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఉండదని, దర్యాప్తును ప్రభావితం చేయబోదని కేంద్రం స్పష్టం చేసింది. సీబీఐ డైరెక్టర్‌ పదవీ కాలం రెండేళ్ల కాలానికే పరిమితమని, కొలీజియం అనుమతి లేకుండా అతడ్ని బదిలీ చేసే అవకాశం లేదని పేర్కొంది. అలాగే, సీబీఐ అధికారులపై వచ్చే అభియోగాలపై దర్యాప్తు చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీ (అకౌంటబులిటీ కమిషన్‌)ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకువచ్చింది. అఫిడవిట్‌ను పరిశీలించిన న్యాయస్థానం తుది విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. బొగ్గు కుంభకోణంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. సీబీఐ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.దర్యాప్తు సంస్థను పంజరంలో బందీని చేశారని కేంద్రం తీరును తప్పుబడుతూనే.. సీబీఐకి స్వయంప్రతిపత్తి కల్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐకి స్వయంప్రతిపత్తి కల్పించేందుకు గాను ప్రభుత్వం మంత్రుల బృందం ఏర్పాటు చేసింది. మంత్రుల బృందం చేసిన సిఫార్సులను ఆమోదించిన కేంద్రం ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *