Thursday, 5 November 2026

స్మార్ట్‌ సిటీగా తిరుపతి అభివృద్ది

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సుందరీకరణ పనులు

తిరుపతి పర్యటనలో సిఎం చంద్రబాబు వెల్లడి

తిరుపతి,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి)
: తిరుపతిని స్మార్ట్‌ సిటీగా అభివృద్ది చేస్తామని, ఇందుకు ప్రతిపాదనలు సిద్దం చేశామని సిఎం చంద్రబాబు ప్రకటించారు. తిరుపతి అభివృద్దిలో భాగంగా, ఐటి, టూరిజం సెక్టారును అభివృద్దిచేస్తామని, మెట్రో రైలు ప్రాజెక్టు అమలుకు చర్యలు చేపట్టామన్నారు. దామినేడు, అవిలాలలో వివిధ నిర్మాణ దశలలో ఉన్న 7,500 ప్రభుత్వ గృహాలను పూర్తి స్థాయిలో వినియోగానికి తీసుకురావడానికి పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపోందించాల్సిందిగా జిల్లా యంత్రాగాన్ని ఆదేశించామన్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేవిధంగా తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రప్రభుత్వం కృతరిశ్చయంతో ఉందని చంద్రబాబునాయుడు తెలిపారు. శుక్రవారం తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతి చేరుకుని అవిలాల చెరువును, వేదాంతపురంలో రాజీవ్‌ గృహకల్ప క్రింద వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న భవన సముదాయాలను పరిశీలించారు. అనంతరం దామినేడు హౌసింగ్‌ కాలని దగ్గర పాత్రికేయులతో మాట్లాడుతూ తిరుపతిని మెగా సిటి చేయాలన్న ఆకాంక్ష తనకున్నదని అందుకు పూర్తి స్థాయిలో వందశాతం భూగర్భ మురుగు నీటి వ్యవస్థను అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు. ఈ గృహాలు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నందున ప్రాధాన్యతా క్రమంలో వీటిని పూర్తి చేస్తామన్నారు. ఇందులో అనర్హులకు మంజూరైన గృహాలను ప్రక్షాళన చేసి అర్హులైన వారికి అందుబాటులోకి తెస్తామన్నారు. ఈగృహ సముదాయాలను సంపూర్ణ నివాస యోగ్యంగా చేయడానికి త్రాగునీరు, డ్రైనేజీ,రోడ్లు,దుకాణ సముదాయాలు తదితర ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటామన్నారు. వీటిలో దాదాపు 7వేలకు పైగా పేదలకు గృహ వసతి కల్పించిన వారమౌతామన్నారు. తరుమలలో త్రాగునీటి అవసరాల కోసం టి.టి.డి ప్రస్తుతం తిరుపతి మున్సిపల్‌ కార్పోరేషన్‌ నుండి నీటిని కొనుగోలు చేస్తుందని, అలాగే శ్రీకాళహస్తి నుండి తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా తిరుపతి త్రాగునీటి అవసరాల కోసం చేపట్టే పనులకు రూ.25కోట్లు టి.టి.డిని భరించాల్సిందిగా కోరుతున్నానన్నారు. తిరుపతి చుట్టప్రక్కల ఉన్న చెరువుల నిర్వహాణ బాధ్యత టి.టి.డి.కి అప్పగించనున్నామని,ఈచెరువులను అభివృద్ది చేసి అన్యాక్రాంతం కాకుండ పరిరక్షణతో పాటు సుందరీకరణ కూడా చేసే బాధ్యతను టి.టి.డి.కి అప్పగించామన్నారు. చెరువుల చుట్టూ పట్టణ ప్రజలకు ఉపయోగపడే విధంగా వాకింగ్‌, జాగింగ్‌ అందుబాటులోకి తెచ్చి ఆధ్యాత్మిక సంగీతం వినిపించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించామన్నారు. తిరుపతిని ఆధ్యాత్మిక నగరం చేయడం వలన భక్తులలో భక్తి భావం పెరుగుతుందని తెలిపారు. గాలేరు నగరి సుజల స్రవంతి, బాలజి రిజర్వాయర్‌ రెండు సంవత్సరాలలో పూర్తి అయితే తిరుపతికి పూర్తిగా త్రాగునీటి సమస్య తీరుతుందన్నారు. రేణిగుంట విమానాశ్రయమును అంతర్జాతీయస్థాయికి అభివృద్ది చేస్తామన్నారు. విమానాశ్రయం చుట్టుప్రక్కల పరిసరాలలో కూడా రాజధానిలాగ అభివృద్ది చేసేందుకు ప్రణళికలు తయారు చేయాల్సిందిగా జిల్లా కలెక్టరుకు సూచించామన్నారు. తిరుమల సమస్యల పరిష్కారానికి ట.టి.డి ఇఓ కు సూచనలు ఇచ్చామన్నారు. అంతకు ముందు స్థానిక ఎంఎల్యే సుగుణమ్మ నివాసానికి వెళ్లి ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు అభినందించారు. అనంతరం ముఖ్యమంత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్ళారు. ఈకార్యక్రమానికి రాష్ట్ర అటవీశాఖ మాత్యులు జిల్లా మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి రాష్ట్ర పురపాలక శాఖమాత్యులు పి.నారాయణ,, జిల్లా కలెక్టరు సిద్దార్ధ్‌, జెన్‌, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి ప్రద్యుమ్న, తిరుపతి నగరపాలక సంస్త కమిషనరు వి.వినయ్‌చంద్‌ పలువురు అధికార అనధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *