Tuesday, 3 November 2026

స్వచ్ఛభారత్‌పై మరో కీలక అడుగు

C

– ట్రాలీలు, బుట్టల పంపిణీ

– సమ్మెకాలంలో తొలగించిన ఉద్యోగులకు తిరిగి కొలువు

– హైద్రాబాద్‌ను కలిసి అభివృద్ధి చేద్దాం రండి

– కేసీఆర్‌

హైదరాబాద్‌,నవంబర్‌9(జనంసాక్షి):

ప్రపంచంలోనే హైదరాబాద్‌ మహానగరం మేటి నగరంగా నిలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో స్వచ్ఛ ఆటో ట్రాలీలు, ఇంటింటికీ చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ పద్ధతిలో తొలి విడతలో 1005 స్వచ్ఛ ఆటో ట్రాలీలు పంపిణీచేశారు.స్వచ్ఛ హైదరాబాద్‌ పై కీలక ముందడుగు పడింది.  గ్రేటర్‌ హైదరాబాద్‌లో చెత్త సేకరణ కోసం ఆటో ట్రాలీలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చజెండా ఊపారు.ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ తడి, పొడి చెత్త సేకరణకు ఇకపై ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలు పంపిణీ చేస్తామన్నారు. ఆకుపచ్చ బుట్టలో తడి, బ్లూ కలర్‌ బుట్టలో పొడి చెత్త వేయాలని,  ప్రతి గృహిణి గుర్తు పెట్టుకుని సహకరించాలని కేసీఆర్‌ కోరారు.ఓ మంచి కార్యక్రమానికి ఈ రోజు అడుగుపడిందన్నారు. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌కు సమైక్య రాష్ట్రంలో కష్టాలు, నష్టాలు ఎదురయ్యాయన్నారు. నగర విస్తరణ ఓ క్రమపద్దతిలో జరగలేదన్నారు. అయితే దీనిపై నిందించుకుంటూ పోకుండా స్వచ్చనగరంగా పార్ఠీలకు అతీతంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. బాగ్యనగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయడానికి తీసుకుంటున్న చర్యలను మరోసారి సీఎం వెల్లడించారు. హైదరాబాద్‌ మహనగరాన్ని గొప్ప నగరంగా ఎలా రూపుదిద్దుకుందామన్న అంశంపై తన ఆలోచనలను నగర ప్రజలకు స్ఫష్టం చేశారు. అన్నదమ్ముల్లా కలిసి హైదరాబాద్‌ను గొప్ప నగరంగా తీర్చి దిద్దుదామని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు హదరాబాద్‌ నగరానికి తాగు నీటికోసం ఎలాంటి దీర్ఘకాలిక ఏర్పాట్లు చేయలేదని, నిజాము కాలమునాటి చెరువులు తప్ప ప్రత్యేకంగా తాగునీటి రిజర్వాయర్లను గత ప్రభుత్వాలు నిర్మించలేదని సీఎం అన్నారు. భవిష్యత్తులో గ్రేటర్‌ నగరానికి తాగు నీటి కొరత ఉండకుండా శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు తయారు చేసినట్లు

చెప్పారు. ప్రత్యేకంగా హైదరాబాద్‌ నగరానికి రెండు డెడికేటెడ్‌ రిజర్వాయర్లను 30 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్నట్లు సీఎం వెల్లడించారు. అత్యంత వేగంగా ఈ రిజర్వాయర్లను నిర్మించాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో వాన పడితే కార్లన్ని.. బోట్లు అవుతాయి. పరిశుభ్రత విషయంలో ఒక్క అడుగు ముందుకు వేయాలని నగరంలోని అన్ని పార్టీల నేతలతో చర్చించాం. ఆ తర్వాత ఆటో ట్రాలీలు, చెత్త బుట్టల పంపిణీనికి నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ 1005 ఆటో ట్రాలీలు.. చెత్త బుట్టలు పంపిణీ చేస్తున్నాం. హైదరాబాద్‌ నగరంలో 42 లక్షల చెత్త బుట్టలు అవసరం. నవంబర్‌ నెలఖారు వరకు చెత్తబుట్టలు పంపిణీ చేస్తాం. ఇక నగరంలో పేదరికాన్ని తరిమికొట్టాల్సిన అవసరం ఉంది అని అన్నారు. చెత్త మేనేజ్‌మెంట్‌పై అధ్యయనం చేసిన తర్వాత ఈ రెండు రకాల చెత్త బుట్టలను రూపొందించినట్లు సీఎం తెలిపారు. కూరగాయలు, అన్నం నుంచి వచ్చే తడి చెత్తను ఆకు పచ్చ బుట్టలో వేయాలి. ప్లాస్టిక్‌, కాగితాలు లాంటి చెత్తను నీలి రంగు బుట్టలో వేయాలి. మరో నెల రోజుల్లో నగరంలోని అన్ని ఇళ్లకు చెత్త బుట్టలను పంపిణీ చేయనున్నారు. చెత్తను ఆటో రిక్షాల ద్వారా సేకరించనున్నారు. సమ్మె కాలంలో విధుల్లో నుంచి తొలగించిన  కార్మికులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త వినిపించారు. దీపావళి పండుగ నేపథ్యంలో ఆ సఫాయిల జీవితాల్లో సీఎం వెలుగులు నింపారు. దీంతో సఫాయి కార్మికులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. విధుల్లో నుంచి తొలగించబడ్డ సఫాయి కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. సీఎం నిర్ణయంతో సఫాయి కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని చెబుతున్నారు. చెత్త  సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమై చర్చించినట్లు చెప్పారు.  ప్రపంచంలోనే హైదరాబాద్‌ను మేటి నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. నగరంలో అనేక నాలాలు కబ్జాకు గురయ్యాయని, చిన్న వర్షానికే హైదరాబాద్‌ జలమయం అవుతుందని, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో నగరంలోని రోడ్లను అద్దంలా తీర్చిదిద్దుతామన్నారు. ఇక సమ్మె కాలంలో తొలగించిన జీహెచ్‌ఎంసీ ఉద్యోగులందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని కేసీఆర్‌ ప్రకటించారు.  ఇక ఇళ్లు, ప్లాట కోసం పేదలు తమ దరఖాస్తులను స్థానిక ఎమ్మెల్యే లేదా ఇన్‌ఛార్జ్‌ మంత్రికి గానీ దరఖాస్తులు ఇవ్వాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మంత్రులు నాయిని , మహేందర్‌ రెడ్డి, పద్మారావు,తలసాని, ఎమ్మెల్యేలు లక్ష్మణ్‌ చింతల రామచంద్రారెడ్డి, ప్రబౄకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *