స్వామివారి నగల తరుగుతో..

కోట్లు వెనుకేసుకున్నారు
బీజేపీ కుట్ర రాజకీయాలకు సహకరిస్తే గుణపాఠం తప్పదు
పొట్ట నింపుకోవడానికి జగన్‌ ఇంటికే వెళ్లాలా?
రమక్షణ దీక్షితులుపై ఆనంద సూర్య సంచలన ఆరోపణలు
విజయవాడ, జూన్‌8(జ‌నం సాక్షి) : స్వామివారి నగలను ముంబైకి తరలించి తరుగు చూపించిన ఘనత రమణ దీక్షితులదని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆనంద సూర్య సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రమణదీక్షితులు కళ్యాణమస్తు కోసం స్వామివారి బంగారాన్ని ముంబైకి తరలించి 40 శాతం తరుగు చూపించారన్నారు. ఈ వ్యవహారంలో అప్పటి చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి రూ. వెయ్యి కోట్లకు పడగలెత్తారని ఆనంద సూర్య ఆరోపించారు. అర్ధరాత్రి, మిట్ట మధ్యాహ్నం డ్యూటీలతో అర్చకులను వేధించిన రమణ దీక్షితులు రాజకీయం చేస్తున్నారని, రాష్ట్రాన్ని అస్థిరపరచాలని బీజేపీ చేస్తున్న కుట్ర రాజకీయాలకు రమణ దీక్షితులు సహకరిస్తే బ్రాహ్మణులు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. అలాగే సంపంగి ప్రాకారంలోని వంటశాలలో నైవేద్యం చేయవచ్చని ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులు లేఖ ఇవ్వలేదా? అని ఆనందసూర్య ప్రశ్నించారు. పొట్ట నింపుకోవడానికి అన్యమతస్థుడు జగన్‌ ఇంటికే వెళ్లాలా? అని పేర్కొన్నారు. బీజేపీ, వైసీపీ ఆడిస్తున్న రాజకీయ కుట్రలో భాగమే రమణ దీక్షితులు వ్యాఖ్యలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తన లాభాపేక్షకోసం తిరుమల తిరుపతి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని, తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైన తీరు మార్చుకోని తిరుమతిరుపతి ప్రతిష్టతను తగ్గించే ప్రయత్నాలు మానుకోవాలని రమణ దీక్షితులను కోరారు.