రంగారెడ్డి: జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో ఆ స్థానాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు భర్తీ చేశారు. రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను నియమించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు టీఆర్‌ఎస్ తీరుపై నిప్పులు చెరిగారు. తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
పార్టీ వీడిన వారిపై విసుర్లు
పార్టీలో గొప్ప పదవులు అనుభవించిన నాయకులు ఇప్పుడు టీడీపీని వీడినా పార్టీకేమీ నష్టంలేదన్నారు చంద్రబాబు. టీఆర్‌ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బాబు ఘాటుగా స్పందించారు. కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని, కార్యకర్తలే తమ బలమనిచెప్పారు.
టీడీపీని చూస్తుంటే కేసీఆర్ గుండెల్లో రైళ్ల పరుగు
టీడీపీని చూస్తుంటే కేసీఆర్ గుండెల్లో.. రైళ్లు పరుగెడుతున్నాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలను బజార్లలో పశువులను కొన్నట్లు కొంటున్నారని బాబు మండిపడ్డారు. టీఆర్ఎస్‌లో చేరిన లీడర్లు తక్షణమే రాజీనామా చేసి గెలవాలంటూ సవాల్ విసిరారు. కొంతమంది నాయకులు స్వార్థంతో పార్టీని వీడారని చంద్రబాబు అన్నారు. మళ్లీ తెలంగాణలో టీడీపీ జెండా రెపరెపలాడాలని కార్యకర్తలకు బాబు పిలుపునిచ్చారు. తాను పట్టుకుంటే వదిలిపెట్టేది లేదన్నారు. మొత్తంగా చంద్రబాబు.. నాయకుల్లో, కార్యకర్తల్లో మనోధైర్యం, ఆత్మవిశ్వాసం నింపడానికి ప్రయత్నించారు.
స్వార్థంతోనే పార్టీని వీడుతున్నారు: చంద్రబాబు




