Monday, 2 November 2026

స్వీప్‌కు స్పీడ్‌ బ్రేక్‌

C

– ఎమ్యెల్సి ఎన్నికల్లో నాలుగు స్థానల్లో టీఆర్‌ఎస్‌ రెండు చోట్ల కాంగ్రెస్‌ గెలుపు

హైదరాబాద్‌,డిసెంబర్‌30(జనంసాక్షి): స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేసింది. ఎన్నికలు జరిగిన మొత్తం ఆరు స్థానాల్లో నాలుగింటిని టిఆర్‌ఎస్‌, రెండింటిని కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేయాలన్న టిఆర్‌ఎస్‌ లక్ష్యం నెరవేరలేదు. కేవలం నాలుగు స్థానాలను మాత్రమే గెల్చుకోగలిగింది. అనూహ్యంగా కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో గెలిచి తన పట్టును నిరూపించుకుంది. ఇటీవలే రికార్డు స్థాయి మెజారిటీతో వరంగల్‌ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యం సాధించి మరోసారి విజయదుందుభి మోగించింది. ఇప్పటికే 6స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్న టీఆర్‌ఎస్‌ ఇపుడు మరో నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో భారీ మెజారిటీతో గెలుపొందింది. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ 10స్థానాలను సునాయసంగా తన ఖాతాలో వేసుకుంది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ కనీస ఓట్లు కూడా సాధించుకోలేక టీడీపీ అడ్రస్‌ గల్లంతు చేసుకుని తిరుగుముఖం పట్టింది. నల్లగొండలో మాజీ ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్‌  రెడ్డి,. పాలమూరులో కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి విజయం సాధించారు. ఇక ఖమ్మంలో బాలసాని గెలుపుతో మాజీ ఎమ్మెల్యే, సిపిఐ సీనియర్‌ నేత పువ్వాడ నాగేశ్వర రావు పరాజయం పొందారు. ఆరు స్థానాలైన.. ఖమ్మం, నల్లగొండలో ఒక్కో ఎమ్మెల్సీస్థానానికి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో రెండేసి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. టీఆర్‌ఎస్‌ నాలుగు స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్‌ రెండు స్థానాలకే పరిమితమైంది. టీడీపీ అడ్రస్‌ గల్లంతైంది. మొత్తం 12 స్థానాలకు గానూ.. కరీంనగర్‌లో రెండు, వరంగల్‌, ఆదిలాబాద్‌ నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో ఒకటి చొప్పున ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన ఆరు స్థానాలకు ఆదివారం ఎన్నిక జరగ్గా, బుధవారం కౌంటింగ్‌ జరిగింది. మొత్తం ఫళితాలు వెలువడడంతో 10 స్థానాలు టిఆర్‌ఎస్‌ గెల్చుకుని ముందంజలో ఉండగా రెండు సీట్లతో కాంగ్రెస్‌ తరవాతి స్థానంలో ఉంది. ఈ ఎన్నికతో మండలిలో టిడిపికి స్థానం లేకుండా పోయింది. ఇక ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ, రంగారెడ్డి జిల్లాలో శంభీపూర్‌ రాజు, పట్నం నరేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపొందారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ అభ్యర్థి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి విజయం సాధించారు. ఇక రెండు స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ కనీస ఓట్లు కూడా సంపాదించుకోలేకపోయింది. టీడీపీ డిపాజిట్‌ గల్లంతు అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలుపొందిన టీఆర్‌ఎస్‌ హర్షం వ్యక్తం చేస్తుంది. ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. బాణాసంచా కాలుస్తూ.. స్వీట్లు పంచుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపించాయని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1256 ఓట్లు పోలవగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డికి 445 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి దామోదర్‌రెడ్డికి 379 ఓట్లు, మరో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుంకిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డికి 273 ఓట్లు, టీడీపీ అభ్యర్థి కొత్తకోట దయాకర్‌రెడ్డికి 152 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి జగదీశ్వర్‌రెడ్డికి 3 ఓట్లు పోలయ్యాయి. నాలుగు ఓట్లను చెల్లని ఓట్లుగా అధికారులు గుర్తించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగగా.. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి 443 ఓట్లతో విజయం సాధించారు. తొలి ప్రాధ్యానత ఓట్లలోనే ఆయన గెలుపొందారు.మరో ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి దామోదర్‌ రెడ్డి విజయం సాధించారు.  నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై 193 ఓట్ల తేడాతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. రాజగోపాల్‌రెడ్డికి 642 ఓట్లు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తేరా చిన్నపురెడ్డి 449 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థులు పురుషోత్తంరెడ్డి 2, మల్లేష్‌గౌడ్‌ ఒక ఓటు పోలైంది. 6 ఓట్లను చెల్లని ఓట్లుగా గుర్తించారు. మొత్తం పోలైన ఓట్లు 1100. రంగారెడ్డి జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డికి 257 ఓట్లు, శంభీపూర్‌ రాజుకి 255 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌కు 135, టీడీపీ -96, స్వతంత్ర అభ్యర్థలుకు 50 ఓట్లు పోలయ్యాయి. ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాలసాని లక్ష్మినారాయణ 31 ఓట్ల తేడాతో గెలుపొందారు. టీఆర్‌ఎస్‌కకు 316 ఓట్లు, సీపీఐ -285, వైసీపీ -102 ఓట్లు పోలయ్యాయి. ఒక ఓటు చెల్లని ఓటు కాగా, ఒకటి నోటాకు పడింది. మొత్తం పోలైన ఓట్లు 692.  రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లాలోని ఓ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డి 257 ఓట్ల తేడాతో గెలుపొందారు. మరో ఎమ్మెల్సీ స్థానాన్ని రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శంబీపూర్‌ రాజు కైవసం చేసుకున్నారు. పోలైన ఓట్లలో 13 చెల్లనివి ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపులో శంబీపూర్‌ రాజు విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్‌ ఓటమిపాలయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డికె అరుణలు తమ సత్తా చాటారు..దూకుడుగా పోతున్న టీఆర్‌ఎస్‌ కు అడ్డకట్ట వేశారు..నల్గొండలో భారీ మెజార్టీ 193ఓట్ల తేడాతో గెలుపొందగా, మహబూబ్‌ నగర్‌ లోనూ వందకు పైగా ఓట్లతో కాంగ్రెస్‌ అభ్యర్థి దామోదర్‌ రెడ్డిని అరుణ గెలిపించుకున్నారు.. ఎన్నికల జరిగిన మిగతా నాలుగుస్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందింది..ఖమ్మంలో 31ఓట్లతో బాలసాని లక్ష్మినారాయణ గెలుపొందగా, ఇక్కడ చక్రం తిప్పిన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు పట్టు నిలుపుకున్నారు. రంగారెడ్డిలో నరేందర్‌ రెడ్డి, శంభీపూర్‌ రాజు లు రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు.. దీంతో మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి చక్రం తిప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *