Wednesday, 4 November 2026

స్వైన్‌ఫ్లూ నివారణకు

తెలంగాణ సర్కారు చర్యలు భేష్‌

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర బృందం3

ఆరోగ్యశాఖ సంచాలకుని సస్పెన్షన్‌

హైదరాబాద్‌,జనవరి22(జనంసాక్షి): తెలంగాణలో స్వైన్‌ఫ్లొ పరిస్థితిని అంచనావేసేందుకు వచ్చిన కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ వ్యాధి నివారణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసించింది. నేషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ ఖరె నేతృత్వంలోని కమిటీ గురువారం గాంధీ ఆసుపత్రిని పరిశీలించింది. వ్యాధి ఉద్ధృతికి గల కారణాలు, పాజిటివ్‌ కేసుల నమోదు, స్వైన్‌ ఫ్లొ మరణాలపై ఈ కమిటీ పూర్తి సమాచారాన్ని సేకరిస్తోంది. ఆతర్వాత ఇక్కడి పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కేంద్ర ప్రభుత్వానికి తుది నివేదిక అందజేస్తుంది. ఇక స్వైన్‌ఫ్లూ నియంత్రణ చర్యల్లో అలసత్వం వహించిన అధికారులపై సర్కారు ఆగ్రహం వ్యక్తంచేసింది. స్వైన్‌ఫ్లూ నివారణలో వైఫల్యం చెందారంటూ ఆరోగ్యశాఖ సంచాలకుడు సాంబశివరావుపై ప్రభుత్వం వేటు వేసింది. కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జ్యోతిబుద్ధప్రకాశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు  తెలంగాణ రాష్ట్రంలో స్వైన్‌ఫ్లొ కేసులు ఇంకా నమోదవుతున్నాయి. స్వైన్‌ఫ్లొతో బుధవారం ఇద్దరు మృతి చెందగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 247 కేసులు నమోదయ్యాయి. గాంధీ ఆసుపత్రిలో 53 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కేంద్రం నుంచి రాష్టాన్రికి సుమారు 50వేల స్వైన్‌ఫ్లొ కిట్లు రానున్నాయి.అన్ని జిల్లాలు, హైదరాబాద్‌లోని ప్రధాన ఆసుపత్రులకు కిట్లు పంపిణీ చేయనున్నారు. కేంద్ర బృందం సభ్యులు నేరుగా గాంధీ ఆసుపత్రికి చేరుకుని బాధితులకు అందిస్తున్న వైద్యసేవలపై సవిూక్షించారు. హైదారబాద్‌ తర్వాత స్వైన్‌ఫ్లొ కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహబూబ్‌నగర్‌లో కూడా కేంద్ర బృందం పర్యటించనుంది. మరోవైపు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం ఉదయం గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్వైన్‌ఫ్లొ బాధితులను పరామర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ… గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డులను బీబీనగర్‌లోని ఆసుపత్రికి తరలించాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు తెలిపారు. స్వైన్‌ఫ్లొ స్వైర విహారాన్ని అడ్డుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం ఉదయం నుంచి వివిధ స్థాయిల్లో సవిూక్షలు జరిపారు. పొద్దున్నే ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడిన కేసీఆర్‌… సాయంత్రం అత్యవసర మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించారు. . జిల్లా కలెక్టర్లనూ అప్రమత్తం చేశారు. అనంతరం కార్పొరేట్‌ ఆసుపత్రుల ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. ప్రజల్లో భయాందోళనలను తగ్గించడానికి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ఇదిలావుంటే ఉదయం సిఎస్‌ రాజీవ్‌ శర్మ కూడా అధికారులతో సవిూక్షించి వారిని అప్రమత్తం చేశారు. నెల రోజులుగా స్వైన్‌ఫ్లొ విజృంభిస్తున్నా.. నివారణపై ప్రజల్ని చితన్యపరచడంలో విఫలమైన వైద్య ఆరోగ్యశాఖ పట్ల ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు అనవసర ఆందోళనకు గురికావద్దనీ, ముప్పు తీవ్రత ఉన్నవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణలో స్వైన్‌ఫ్లొ విజృంభిస్తోందని వస్తున్న కథనాలపై కేసీఆర్‌ తీవ్రంగా స్పందించారు.  దీనిపైనే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. హుటాహుటిన వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చందాను దిల్లీకి పంపించారు. రాష్ట్రంలో పరిస్థితిని ఆయన కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు వివరించి, సాయానికి సంబంధించిన నివేదికను అందజేశారు. అయితేమరుసటి రోజే  ప్రజారోగ్య సంచాలకులు సాంబశివరావును ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *