Tuesday, 3 November 2026

హాట్‌హాట్‌గా శీతాకాల సమావేశాలు

2

నేటి నుంచి పార్లమెంట్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 22 (జనంసాక్షి) : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు వేడివేడిగా జరుగనున్నాయి. నేటి నుంచి ప్రారంభమయ్యే సమావేశాలు వచ్చే నెల 23వ తేదీవరకు కొనసాగనున్నాయి. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సజావుగా సాగుతాయని ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. ముఖ్యమైన అంశాలను పార్లమెంట్‌ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రతిపక్షాలు కలిసిరావాలని ఆయన కోరారు. ఈ సమావేశాల్లో 22 పనిదినాలు పార్లమెంటు నడువనుంది. నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న రెండో సమావేశాలు కావటంతో తొలి సమావేశాలకంటే ఈసారి వాడీవేడిగా చర్చలు జరిగే అవకాశముంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఆరునెలలు కాలంలో సర్కారు సాధించిన విజయాలు, ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన హావిూల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాల్లో అధికార, విపక్షాలు సిద్ధమవుతున్నాయి. బీజేపీ ఎన్నికల హావిూలపై ప్రతిపక్షాలు దృష్టిసారించనున్నాయి. నల్లధనంపై సర్కారును నిలదీసేందుకు విపక్షాలు ఇప్పటికే తమ ప్రణాళికలు సిద్ధంచేసుకున్నాయి. ఈ సమావేశాల్లో 67 పెండింగ్‌ బిల్లులు చర్చకు రానున్నాయి.  అన్ని రాజకీయ పార్టీలతో విందు ఏర్పాటుచేసిన స్పీకర్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల్లోని నల్లధనాన్ని వందరోజుల్లో వెనక్కితెస్తామన్న ప్రధాని మోదీ ఎన్నికల వాగ్ధానాన్ని నిలబెట్టుకోవటంలో విఫలమైన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తున్నది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆర్థిక సంస్కరణల్లో వేగంపెంచి ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు తలుపులు బార్లా తెరువాలని భావిస్తున్న మోదీ సర్కారు నిర్ణయాలపై వామపక్షాలు ఇప్పటికే అగ్గివిూద గుగ్గిలమవుతున్నాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ 125వ జయంతి సందర్భంగా ఇటీవలే ఎన్డీయే ప్రత్యర్థి పార్టీలన్నీ విబేధాలు మరిచి ఒకే వేదికవిూదికి వచ్చిన నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో కూడా ప్రతిపక్షాలు ఇదే ఐక్యతను ప్రదర్శించవచ్చని తెలుస్తున్నది. అదే జరిగితే లోక్‌సభ, రాజ్యసభల్లో పలు బిల్లుల ఆమోదంపై మోదీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశముందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాగా, పార్లమెంటు సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయపక్షాలు సహకరించాలని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ విజ్ఞప్తి చేశారు. సోమవారం నుంచి సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం అన్ని పార్టీల పార్లమెంటరీ పార్టీ నాయకులతో ఆమె విందు సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై ఉభయసభల్లో నిర్మాణాత్మక చర్చలు జరిగేలా సహకరించాలని కోరారు. ఈ సమావేశాలపై చర్చించేందుకు ప్రభుత్వం కూడా ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తెలిపారు.

22 రోజులపాటు జరుగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మొత్తం 67 పెండింగ్‌ బిల్లులు ఉభయసభల ముందుకు రానున్నాయి. ఈ సమావేశాల్లో నాలుగు రోజులు ప్రైవేటు బిల్లులపై చర్చలకు కేటాయించారు. 67 బిల్లుల్లో యూపీఏ-2 ప్రభుత్వం ప్రవేశపెట్టి పెండింగ్‌లో ఉన్నవి 40 కాగా, అంతకంటే ముందు నుంచే పెండింగ్‌లో మరో 18 బిల్లులున్నాయి. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొమ్మిది బిల్లులున్నాయి. మొత్త 67 బిల్లుల్లో 59 రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉండగా, ఎనిమిది బిల్లులు లోక్‌సభలోనూ ఆమోదం పొందాల్సి ఉన్నది. రాజ్యసభలో మోదీ ప్రభుత్వానికి మెజారిటీ లేకపోవటంతో ఈ బిల్లుల ఆమోదానికి ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పటికే సంప్రదింపులను మొదలు పెట్టారు. ఈ సమావేశాల్లో బొగ్గు గనుల (సవరణల) బిల్లు, గూడ్స్‌ సర్వీస్‌ టాక్స్‌ (జీఎస్టీ) బిల్లు, బీమా చట్టం (సవరణల) బిల్లు, రియల్‌ ఎస్టేట్‌ (క్రమబద్ధీకరణ-అభివృద్ధి) బిల్లు, అవినీతి నిరోధక బిల్లు, భూసేకరణ బిల్లు, పొగాకు ఉత్పత్తుల (సవరణ) బిల్లు, యాంటీ-హైజాకింగ్‌ (సవరణ) బిల్లు తదితర కీలక బిల్లులను ఆమోదించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మోదీ ప్రభుత్వం గత నెలలో జారీచేసిన బొగ్గు గనుల సవరణ బిల్లు ఆర్డినెన్సుకు ఈ సమావేశాల్లో ఉభయ సభల ఆమోదం లభించాల్సి ఉంది. గూడ్స్‌ సర్వీస్‌ టాక్స్‌ బిల్లుపై ఇప్పటికే వివిధ రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించిన కేంద్రం, ఈ సమావేశాల్లో దానికి తప్పక చట్టరూపం కల్పించాలని భావిస్తున్నది. అయితే, ఈ బిల్లును ఇప్పటికీ చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లుకు వివిధ ప్రాంతీయ పార్టీల నుంచి సభలో తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశముంది. భూసేకరణ బిల్లు విషయంలోనూ ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అదేవిధంగా బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49% వరకు పెంచేందుకు యూపీఏ-2 ప్రభుత్వం తెచ్చిన బిల్లుపై వామపక్షాలు, కొన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నందున దీనిపై వేడీవేడి చర్చ జరుగనుంది. పెండింగ్‌ బిల్లుల్లో 11 ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ రంగాలకు చెందినవి ఉండగా, తొమ్మిది బిల్లులు కార్మిక-ఉపాధికల్పన శాఖకు సంబంధించినవి ఉన్నాయి. మెంటల్‌ హెల్త్‌కేర్‌ బిల్లు – 2013, డ్రగ్స్‌-కాస్మొటిక్స్‌ (సవరణ) బిల్లు – 2013, హెచ్‌ఐవీ (నిరోధక-నియంత్రణ) బిల్లు – 2014 తదితర బిల్లులు పార్లమెంటు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. కార్మికశాఖకు సంబంధించి మోడీ ప్రభుత్వం గత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టిన పరిశ్రమల చట్ట (సవరణ) బిల్లు – 2014, అప్రెంటిస్‌ (సవరణ) బిల్లు – 2014 ఈ సమావేశాల్లో ప్రభుత్వానికి కీలకంగా ఉన్నాయి. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న బాలకార్మిక (నిషేధ-క్రమబద్ధీకరణ) బిల్లు – 2012, భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన బిల్లు కూడా ఈ సమావేశాల్లో చర్చకు రానున్నాయి.

వివిధ స్టాండింగ్‌ కమిటీలు పరిగణనలోకి తీసుకున్న మరికొన్ని బిల్లులు కూడా ఈ సమావేశాల్లో ఉభయ సభల ముందుకు రానున్నాయి. జువెనైల్‌ జస్టిస్‌ (బాల నేరస్తుల సంరక్షణ, భద్రత) బిల్లు, శారీరక వికలాంగుల హక్కుల బిల్లు, రైల్వే ?ర(సవరణ) బిల్లు, ట్రిబ్యునల్స్‌, అప్పిలేట్‌ ట్రిబ్యునల్స్‌ బిల్లు, టెక్స్‌టైల్స్‌ (జాతీయీకరణ) బిల్లు తదితర పెండింగ్‌ బిల్లులు కూడా చర్చకు రానున్నాయి.

ప్రశ్నోత్తరాల సమయంలో మార్పులేదు: స్పీకర్‌

లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎలాంటి మార్పు లేదని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ స్పష్టంచేశారు. రాజ్యసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని మారుస్తున్నప్పటికీ, లోక్‌సభలో మాత్రం అలాంటి ప్రతిపాదన ఏదీలేదని చెప్పారు. ఉదయం పదకొండు గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించే ప్రశ్నోత్తరాల సమయాన్ని మార్చాలని అఖిల పక్ష సమావేశంలో ఏ పార్టీ కూడా కోరలేదన్నారు.

సజావుగా పార్లమెంట్‌ సమావేశాలు: మోదీ

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ముఖ్యమైన అంశాలను పార్లమెంట్‌ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రతిపక్షాలు కలిసిరావాలని ఆయన కోరారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆయనీ విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రభుత్వాన్ని నిలదేసేందుకు విపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. బీమా రంగంలో ఎఫ్‌ డీఐ పెంపు వ్యతిరేకిస్తామని జేడీ(యూ), సీపీఎం, బీఎస్పీ, ఎస్పీ ప్రకటించాయి. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్‌ మద్దతు కోరతామని తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *