హైదరాబాద్: హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనాలను నడిపేవారిపై తీసుకుంటున్న చర్యలేమిటో చెప్పాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తెలంగాణ స్పెషల్ జీపీ సంజీవ్‌కుమార్‌ను అడిగింది. ఉల్లంఘనులపై ఏ మేరకు జరిమానా విధిస్తున్నారని ప్రశ్నించింది. గడిచిన రెండు వారాల్లో సుమారు 10,400 మంది హెల్మెట్లు లేకుండా ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్న కేసులు నమోదు చేసి రూ.100 చొప్పున జరిమానా విధించామని స్పెషల్ జీపీ కోర్టుకు తెలిపారు. తరచూ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై రూ.100 జరిమానాతో సరిపెట్టకుండా…హెల్మెట్ ధరతో సమానంగా జరిమానా విధిస్తే పరిస్థితి దారికి వస్తుందని డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. మోటారు వాహనాల చట్టం కేంద్రం పరిధిలోనిదని, ఏదేని మార్పులు చేయాలంటే కేంద్రమే చేయాల్సి ఉందని తెలిపారు. తొలిసారి ఉల్లంఘించిన వారికి రూ.100, రెండు, మూడోసారి ఉల్లంఘిస్తే రూ.300 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని స్పెషల్ జీపీ కోర్టుకు తెలిపారు. స్పెషల్ జీపీ వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసాలే, జస్టిస్ ఎస్‌వీ భట్‌లతో కూడిన ధర్మాసనం హెల్మెట్ ధరించని వారిపై తీసుకుంటున్న తదుపరి చర్యలు కోర్టుకు స్పష్టం చేయాలని ఆదేశించింది.
హెల్మెట్ ధరించకుండా నడిపేవారిపై చర్యలేమిటి?




