హైదరాబాద్ : జేఎన్‌యూ విద్యార్థి కన్నయ్య కుమార్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కన్నయ్యకు పలువురు విద్యార్థులు, సీపీఐ కార్యకర్తలు స్వాగతం పలికారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసమే హెచ్‌సీయూకు వెళ్తున్నట్లు కన్నయ్య తెలిపారు. రోహిత్ వేముల తల్లిని పరామర్శిస్తామన్నారు. తాను సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటానని కన్నయ్య కుమార్ చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో సామాజిక న్యాయం కోసం ప్రయత్నిస్తున్నానన్నారు. అడుగడుగునా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు కన్నయ్య కుమార్ రాక నేపథ్యంలో హెచ్‌సీయూలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో వర్శిటీ అధికారులు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించారు.యూనివర్శిటీకి వెళ్లే గేట్లను మూసివేశారు. ప్రధాన ద్వారం దగ్గర పోలీసులు మోహరించారు. అలాగే వర్శిటీలో తాగునీరు విద్యుత్ కట్ చేశారు. మీడియాకు అనుమతి నిరాకరించారు. అటు కన్నయ్య రాకను ఏబీవీపీ వ్యతిరేకిస్తోంది. మరోవైపు యూనివర్శిటీలో కన్నయ్య కుమార్ సభా ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన సీపీఐ నేత అజీజ్ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ వీహెచ్‌ను కూడా అడ్డుకున్నారు.




