Monday, 2 November 2026

హైదరాబాద్‌లో గంటలో 9.25 సెం.మీ వాన

15brk-93aహైదరాబాద్‌: భాగ్యనగరంపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. అయితే గురువారం వరుణుడు తన ప్రతాపాన్ని చూపాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీవర్షం కురిసింది. గంట వ్యవధిలో 9.25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం.

గురువారం మధ్యాహ్నం నగరంలోని పలుచోట్ల ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. అనంతరం చినుకులుగా ప్రారంభమైన వర్షం ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు గంటపాటు కుండపోతగా కురుస్తూనే ఉంది. నగరంలో వినాయక నిమజ్జనం సాగుతున్న సమయంలో వరుణుడు ప్రతాపం చూపించడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.

హైదరాబాద్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, కూకట్పల్లిలో భారీ వర్షం పడింది. పాతబస్తీ, చార్మినార్, శాలిబండ, కాలాపత్తర్, కామటిపురా, దూద్ బౌలి, హుస్సేని ఆలం, బహదూర్ పురా, పురాణాపూల్లో కుండపోత కురిసింది. సికింద్రాబాద్, తార్నాక, ఓయూ, రాంనగర్, అంబర్పేట, రామంతాపూర్, అబిడ్స్, కోఠి, మలక్ పేట, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, చైతన్యపురి, సరూర్నగర్, ఎల్బీనగర్లో గంటల తరబడి వాన దంచికొట్టింది. బోయిన్పల్లి, బేగంపేట, పంజాగుట్ట, లక్డీకాపూల్, మాసాబ్ ట్యాంక్ లో వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామైంది. వర్షం ధాటికి హిమాయత్ నగర్ లో ఓ ఇల్లు కూలిపోయింది. అఘాపుర, మాలకుంట నాలాలు పొంగడంతో పక్కనే ఉన్న ఇండ్లు, గుడిసెలలోకి వరద నీళ్లు చేరాయి. మలక్ పేట్ అలీ కేఫ్ బ్రిడ్జి వాన నీటిలో మునిగిపోయింది.

ఇటు సికింద్రాబాద్ ఏరియాలోని అడ్డగుట్ట, పార్శిగుట్ట, వారాసిగూడ, లాలాపేట, ఈసీఐల్, బోడుప్పల్ లో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. తిరుమలగిరి, బొల్లారం, నాగోలు, ఉప్పల్, బండ్లగూడ, నాచారం, సైదాబాద్, సంతోష్నగర్, చంపాపేట్, కర్మన్ ఘాట్లో వాన నీరు ఏరులై పారింది. మల్కాజ్ గిరి, నేరెడ్ మెట్, కుషాయిగూడ, హబ్సిగూడ, మల్లాపూర్ లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఉప్పల్ చౌరస్తాలో భారీగా వరద నీరు నిలిచి పోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి కాప్రా సర్కిల్ పరిధి మల్లాపూర్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ముషీరాబాద్ లోని నాగమయ్య కుంటలో ఒక వ్యక్తి జల సమాధి అయ్యాడు. రాత్రి గాఢనిద్రలో ఉన్న నారాయణ అనే వ్యక్తి వర్షపు నీటిలో మునిగి మృతిచెందాడు.

భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్ధీన్, కమీషనర్ జనార్ధన రెడ్డి నగరంలో క్షేత్రస్థాయి పర్యటన జరిపారు. నాచారం దగ్గర నాలాను పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, పాత గోడల పక్కన నివాసముంటున్న వాళ్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అటు ముందు జాగ్రత్త చర్యగా కొన్ని చోట్ల విద్యుత్ అధికారుల తనిఖీలు చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్లు, అధికారులతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ రఘుమా రెడ్డి సమీక్ష నిర్వహించారు. నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.

ఇక రంగారెడ్డి జిల్లాలోనూ మస్త్ వానలు పడ్డాయి. హయత్నగర్, రాజేంద్రనగర్, కాప్రా, చర్లపల్లి, దమ్మాయిగూడ, నాగారం, కీసరలో వాన దంచి కొట్టింది. ధరూర్ దగ్గర ఒంటిమామిడి వాగు వరద నీటితో ఉప్పొంగింది. ఈసీ, మూసీ, కాగ్నా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కోట్ పల్లి, జుంటుపల్లి, లక్నాపూర్ ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. శంకర్పల్లి-చేవెళ్ల, తాండూర్-హైదరాబాద్, తాండూరు-మహబూబ్నగర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాండూరు మండలం వీరశెట్టిపల్లి జల దిగ్భందం అయింది.

ఆలంపల్లి-కొత్తగడి మధ్య మూసీ నదిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. కొత్తగడి దగ్గర రైలు పట్టాలపై వర్షపు నీరు నిలిచి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రాళ్ల చితంపల్లిలో వాగులో దంపతులు గల్లంతయ్యారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా.. భర్త చెట్టు కొమ్మను పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. వికారాబాద్ నియోజకవర్గం బంట్వారం మండలంలోని మద్వాపూర్ వాగులో ఇండికా కారు కొట్టుకుపోయింది. కారుతో సహా ఆరుగురు వ్యక్తులు వరద నీటిలో గల్లంతయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమతంగా ఉండాలని మంత్రి మహేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *