– సుందర్ పిచాయ్ వెల్లడి
న్యూఢిల్లీ,డిసెంబర్16(జనంసాక్షి): ప్రముఖ ఐటి సంస్థ గూగుల్ తన కొత్త క్యాంపన్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు గూగుల్ సి.ఇ.ఓ సుందర్ పిచ్చయ్ ఈ విషయాన్ని ప్రకటించారు.దేశ అవసరాలకు తగిన విధంగా కొత్త ఉత్పత్తుల తయారీకి కొత్త క్యాంపస్ అవసరమని, దానిని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. గతంలో తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అమెరికా పర్యటనలో ఈ ప్రతిపాదన వచ్చింది. అందుకు అనుగణంగా హైదరాబాద్ క్యాంపస్ ఏర్పాటుకు సిఇవో సుందర్ పిచాయ్ ఆమోదించారు. బుధవారం ఢిల్లీ చేరుకున్న పిచాయ్ ఇక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. వంద రైల్వే స్టేషన్ లలో వైఫై సదుపాయం కల్పించబోతున్నట్లు ఆయన తెలిపారు. రైల్ టెల్ సహకారంతో దీనిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. భారతదేశంలోని వంద రైల్వే స్టేషన్లకు 2016 డిసెంబర్ నాటికల్లా వై-ఫై సదుపాయం కల్పిస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు. భారతదేశ పర్యటనలో ఉన్న ఆయన విూడియా, డెవలపర్లు, పారిశ్రామికవేత్తలు, మార్కెటింగ్ నిపుణులతో ఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో ఇంటర్‌నెట్ వాడకాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా పిచాయ్ పర్యటన సాగుతున్నట్లు తెలుస్తోంది. సామాన్యుడి చెంతకు కూడా టెక్నాలజీని తీసుకెళ్లాలన్నది పిచాయ్ వ్యూహమని చెబుతున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా ఐదు అంశాలను ప్రస్తావిస్తున్నారు. మూడేళ్లలో భారతదేశంలోని 3 లక్షల గ్రామాల్లో మహిళలకు ఇంటర్‌నెట్ సదుపాయం కల్పించేందుకు గూగుల్ సాయం చేయనుంది. భారతదేశం కోసం ఉత్పత్తులు తయారుచేసేందుకు హైదరాబాద్‌లో ‘ఇంజనీరింగ్ ప్రెజెన్స్’ను పెంచడం, 11 భాషల్లో టైప్ చేసేందుకు ఉపయోగపడే గూగుల్ ‘ఇండిక్’ కీబోర్డు, 2016 నుంచి గూగుల్ సెర్చ్ ద్వారా లైవ్ క్రికెట్ అప్‌డేట్లు తదితర అంశాలను పరిగణిస్తున్నారు.





