– అందరికీ ఇళ్లు ప్రభుత్వ విధానం
– మూడు బృహత్పథకాలను ప్రారంభించిన మోదీ
న్యూఢిల్లీ,జూన్25(జనంసాక్షి):
హైదరాబాద్ లో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల విధానాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో పట్టణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించిన మోడీకి జీహెచ్ ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ప్రాపర్టీ వసూళ్లకు తీసుకున్న చర్యలను వివరించారు. అనంతరం స్మార్ట్ సిటీస్, అమృత్ టౌన్స్, ప్రధాని ఆవాస్ యోజన పథకాల ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని.. హైదరాబాద్ లో ట్యాక్స్ వసూళ్ల విధానాన్ని ప్రశంసించారు. హైదరాబాద్ లో ప్రాపర్టీ ట్యాక్స్ ను సమర్థవంతంగా వసూలు చేస్తున్నప్పుడు మిగతా నగరాలెందుకు ఆ పనిచేయడం లేదని ప్రశ్నించారు.
నగరాల్లో ఇంకా 2కోట్ల మందికి నివాసయోగ్యం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. స్వాతంత్య్రానంతరం ఇప్పటికీ అందరికీ గృహవసతి లేదన్నారు. పేదలను వారి దౌర్భాగ్యానికి వదిలి వేయలేయమని అన్నారు. గతంలో తప్పులు జరిగి ఉండవచ్చని, అలాగని వదిలి వేయలేమని అన్నారు. దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మూడు బృహత్ పథకాలను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 68 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఫుట్‌పాత్‌లు, మురికివాడల్లో కనీస వసతులు లేని ప్రజలు ఎంతోమంది ఉన్నారన్నారు. ఉపాధి కోసం పట్టణాలకు వస్తోన్న వారంతా దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారని పేర్కొన్నారు. అలావచ్చిన సామాన్యుడి అవసరాలను తీర్చాలన్నారు. దేశంలోని 40 శాతం మంది ప్రజల అభివృద్ధి బాధ్యతలు నగర ప్రజా ప్రతినిధులపైనే ఉందని అన్నారు. నగరాల్లో ఇవాళ్టికి రెండు కోట్ల మందికి నివాసయోగ్యంలేదని వెల్లడించారు. స్వతంత్ర భారతంలో ప్రతీ కుటుంబానికి ఒక ఇళ్లు ఉండకూడదా?అని ఆవేదన వ్యక్తం చేశారు. 68 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా ఎంతో మంది మురికివాడలు, ఫుట్‌పాత్‌లపైనే ఉంటున్నారని పేర్కొన్నారు. అలాంటి వాళ్ల జీవితాల్లో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం మనపై ఉందన్నారు. ప్రైవేటు వ్యక్తులు గృహ నిర్మాణంలో ఉన్నా ఇల్లు కడతారుగానీ వసతులు కల్పించలేరన్నారు. నగర పాలికలు వసతులు ఏర్పాటు చేసినప్పుడే నగరం అభివృద్ధి
చెందుతుందన్నారు. ఆకర్షణీయ నగరాలు(స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టు), అటల్ పట్టణ రూపాంతరీకరణ పునరుజ్జీవన పథకం (అమృత్), అందరికీ ఇళ్లు( ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన) పథకాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం దిల్లీ విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఏ నగరానికి ఆనగరం స్వతంత్రంగా ప్రణాళికలు వేసుకున్నప్పుడు సంపూర్ణ వికాసం ఉంటుందన్నారు. ప్రణాళికాలోపాల వల్లే నగరాల్లో విద్యుత్, నీరు డ్రైయినేజీ వంటి వసతులు సకాలంలో అందుబాటులోకి రాలేకపోతున్నాయన్నారు.ఉపాధి కోసం వలసలతో పట్టణీకరణ పెరుగుతోందని, సామాన్యుడికి కావాల్సిన కనీస అవసరాలను తీర్చాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పట్టణ జీవన విధానంలో మార్పు తేవాలన్నదే తమ ప్రయత్నమని వివరించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు సమష్టిగా ఈ పథకాలు విజయవంతం చేయాలని కోరారు. పట్టణ జనజీవన విధానం మార్పుపై అందరం కలిసి చర్చించాలని పేర్కొన్నారు. ఇలాంటి మార్పుతేవడమే తమ ప్రభుత్వ ప్రయత్నమని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ఇంకా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాల్సి ఉందని తెలిపారు. మనమందరం కలిసి కూర్చుని చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పథకాల అమలు కోసం ఐదేళ్లలో రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు సమష్టిగా ఈ పథకాలను అమలు చేసి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. మనమంతా కష్టపడి పనిచేస్తే దేశ స్వరూపం ఖచ్చితంగా మారుతుందని తెలిపారు. దేశంలో పట్టణీరణ వేగవంతమవుతోందని వెల్లడించారు. ఉపాధి కోసం నగరాలకు వచ్చే పేదల సంఖ్య పెరుగుతోందని వారి కోసం నగరంలో కనీస అవసరాలు కల్పించి వారి అవసరాలను తీర్చాల్సిన అవసరం ఉందని తెలిపారు.మన దేశంలోని పేదలను వారి అదృష్టానికి వదిలివేయకూడదన్నారు. నగరపాలికలు వసతులు ఏర్పాటు చేసినపుడే నగరం అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఏ నగరానికి ఆ నగరం స్వతంత్రంగా ప్రణాళికలు రూపొందించుకున్నపుడే సంపూర్ణ వికాసం చెందుతాయని వివరించారు. ప్రణాళికల్లో లోపాల వల్లే నగరాల్లో విద్యుత్, నీరు, డ్రైనేజీ వంటి వసతులు సకాలంలో అందుబాటులోకి రాలేక పోతున్నాయని తెలిపారు.
స్మార్ట్‌సిటీ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చోటు
ప్రధాని ప్రవేశ పెట్టిన మూడు పథకాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాలను కేంద్రం స్మార్ట్ సిటీస్ జాబితాలో చేర్చింది. అమృత్ నగరాల జాబితాలో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రామగుండం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నల్లగొండ, ఆదిలాబాద్, కొత్తగూడెం, సిద్దిపేట, సూర్యాపేట, మిర్యాలగూడ, జగిత్యాల పట్టణాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రూ.48 వేల కోట్లతో 100 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయనున్నారు. ఒక్కో స్మార్ట్ సిటీకి ఏడాదికి రూ. 100 కోట్ల చొప్పున ఐదేళ్ల వరకు కేంద్రం నిధులు ఇవ్వనుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో 5 స్మార్ట్‌సిటీలు, 46 అమృత్ పట్టణాలను కేంద్రం ఆధునీకరించనుంది. ఏపీలో 3, తెలంగాణలో 2 స్మార్ట్‌సిటీలు ఎంపికవగా, ఏపీలో 31, తెలంగాణలో 15 అమృత్ పట్టణాలను ఎంపిక చేశారు.





