పుణె: మహారాష్ట్ర పుణె జిల్లాలోని అంబేగావ్ తాలూకా మాలిన్ గ్రామంలో కొండ కింద నివసించే వారి ఇళ్లపై కొండ చరియలు విరిగిపడడంతో పెద్దసంఖ్యలో ప్రాణనష్టం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనలో 10 మంది మరణించారని, మరో 150 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారని అధికారులు చెప్పినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హర్షవర్ధన్ పాటిల్ తెలిపారు.కొండ కింద ఉన్న దాదాపు 50 ఇళ్లపై బుధవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ ఇళ్లలో వారు నిద్రిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. శిథిలాల కింద ఎంతమంది మరణించి ఉంటారో అంచనాకు రాలేకపోతున్నట్లు పోలీసులు తెలిపారు. సమీపంలోని తాలేగావ్ క్యాంప్ నుంచి జాతీయ విపత్తు రక్షణ దళానికి(ఎన్డీఆర్ఎఫ్) చెందిన ఒక బృందం హుటాహుటిన గ్రామానికి తరలివచ్చి సహాయక చర్యలు చేపట్టింది.శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు పెద్దఎత్తున సహాయక బృందాలను రంగంలోకి దింపినట్లు జిల్లా కలెక్టర్ సౌరవ్ రావు తెలిపారు. ‘‘కచ్ఛితంగా ఎంత మంది మరణించి ఉంటారన్నది నిర్ధారించలేము. శిథిలాల కింద సురక్షితంగా ఉన్న వారిని వెలుపలికి తీసేందుకు నెమ్మదిగా శిథిలాల తొలగింపు జరుగుతోంది. బాధితులకు వైద్య సహాయాన్ని అందచేసేందుకు సుమారు 30 అంబులెన్సులను సిద్ధం చేశాము’’ అని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఐదుగురిని సజీవంగా వెలుపలికి తీసుకువచ్చినట్లు అనధికారికంగా తెలిసింది.