
బొత్స సత్యనారాయణ
హైదరాబాద్, నవంబర్ 5 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాసిన లేఖకు పీసీసీ బదులిచ్చింది. 11 అంశాలపై వంద పేజీలతో కూడిన నివేదిక రూపొందించి కేంద్ర మంత్రుల బృందానికి పంపింది. రాష్ట్ర విభజనకు సంబంధించి ఇరు ప్రాంతాలకు చెందిన నివేదికలను కేంద్ర హోంశాఖకు పంపామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, సున్నితమైన అంశాలపై ఇరు ప్రాంతాల నేతలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని తెలంగాణ ప్రాంత నేతలు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర నేతలు తమ తమ నివేదికలు అందజేశారని అన్నారు. ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలతో కూడిన వంద పేజీల నివేదికను ఈ మెయిల్ ద్వారా పంపినట్లు చెప్పారు. విభజన నేపథ్యంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రాంత నేతల అభిప్రాయాలతో కూడిన నివేదిక డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తనకు అందజేశారని, అలాగే సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీమాంధ్ర ప్రాంత నేతలు వ్యక్త పరిచిన అభిప్రాయాలతో పాటు గతంలో హైకమాండ్ రాసిన లేఖలను జతచేసి మొత్తం 10 పేజీల నివేదిక మంత్రి శైలజానాథ్ తనకు సమర్పించారని, ఆ నివేదికను కూడా కేంద్రానికి పంపినట్లు చెప్పారు.
100 పేజీల నివేదిక పంపాం




