Tuesday, 3 November 2026

ఫిబ్రవరి 11న పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు

జైరాం రమేశ్‌ ప్రవేశపెట్టే అవకాశం
శరవేగంతో ఏర్పాట్లు
న్యూఢిల్లీ, జనవరి 28 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఫిబ్రవరి 11న పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి జైరాం రమేశ్‌తో లోక్‌సభలో బిల్లు పెట్టేందుకు కేంద్ర హోం శాఖ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తెలంగాణ బిల్లు లోపభూయిష్టంగా ఉందటూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జైరాం రమేశ్‌ స్పందిస్తూ బిల్లు రాజ్యాంగబద్ధంగా లేదనడం సబబు కాదని, తానేమీ కిరణ్‌లాగా న్యాయ, పరిపాలన అంశాల్లో నిపుణుడిని కాదంటూ జైరాం ఎద్దేవా చేశారు. అన్ని అంశాలను చర్చించిన తర్వాతే మంత్రివర్గ బృందం రూపొందించిన బిల్లు ఇది. న్యాయశాఖ, కేబినెట్‌ ఆమోదం కూడా పొందిన విషయాన్ని జైరాం గుర్తు చేశారు. జీవోఎం రూపొందించిన బిల్లును కేబినెట్‌ ఆమోదించింది. కేబినెట్‌ ఆమోదించిన బిల్లే బిల్లు అవుతుంది తప్ప మరొకటి కాదని ఆయన స్పష్టం చేశారు. అసలు.. నకిలీ బిల్లు అంటూ ఏది ఉండదని ఆయన కుండబద్ధలు కొట్టారు. బిల్లుపై అనవసరమైన చర్చే అవసరం లేదని జైరాం తేల్చిచెప్పిన నేపథ్యంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహా సీమాంధ్ర నేతల బెదిరింపులకు అధిష్టానం ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విషయం రూఢీ అయ్యింది. ఈమేరకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో సంబంధం లేకుండా కేంద్ర తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను చకచకా కానిచ్చేస్తుంది. బిల్లు రాష్ట్రపతి నుంచి వచ్చిన వెంటనే జీవోఎం మరోమారు భేటీ అయి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే తుది బిల్లును రూపొందించే అవకాశం ఉంది. అంతకుముందుగానే పూర్తిస్థాయిలో బిల్లును సిద్ధం చేసుకొని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, మండలి అభిప్రాయాలు, చర్చ సాగిన సమయం, పాల్గొన్న ప్రతినిధుల వివరాలను బిల్లుకు జోడించి పార్లమెంట్‌ ప్రవేశపెట్టాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. జీవోఎంలో కీలక భూమిష పోషించిన జైరాం రమేశ్‌ తుది ముసాయిదా రూపొందించిన పనిలో బిజీగా ఉన్నాడు. ఆయన హోం శాఖ అధికారులతో టచ్‌లో ఉంటూ బిల్లును సిద్ధం చేయిస్తున్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *