Tuesday, 3 November 2026

స్వలింగ సంపర్కం నేరమే

రివ్యూ పిటిషన్‌ కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ, జనవరి 28 (జనంసాక్షి) :
స్వలింగ సంపర్కం నేరమేనని సుప్రీంకోర్టు మరోమారు స్పష్టంచేసింది. స్వలింగ సంపర్కంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను మంగళవారం విచారించిన ధర్మాసనం వాటిని తోసిపుచ్చింది. గే సెక్స్‌ నేరమని తామిచ్చిన తీర్పుపై తిరిగి సమీక్షించేది లేదని తేల్చి చెప్పింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను విచారించబోమని పేర్కొంది. గతంలో స్వలింగ సంపర్కంపై ఇచ్చిన తీర్పును జస్టిస్‌ దత్తు, జస్టిస్‌ ఎస్‌.జే.ముఖోపాధ్యాయతో కూడిన ధర్మాసనం సమర్ధించింది. స్వలింగ సంపర్కం నేరమంటూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 2013 డిసెంబన్‌ 12న సుప్రీం కోర్టు స్వలింగసంపర్కం నేరమంటూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం, నాజ్‌ ఫౌండేషన్‌ అనే ఎన్జీవో వేర్వేరుగా రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. ఇద్దరు స్త్రీలు లేదా పురుషులు పరస్పర సమ్మతితో లైంగిక కార్యకలాపాలకు పాల్పడితే అది నేరంగా పరిగణించాలన్న ఐపీసీలోని 377 సెక్షన్‌ను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఆ తీర్పును సమీక్షించాలన్న రివ్యూ పిటిషన్‌నూ సుప్రీం మంగళవారం తోసిపుచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *