ఆధార్‌తో ఇక పనిలేదు : వీరప్పమొయిలీ
న్యూఢిల్లీ, జనవరి 30 (జనంసాక్షి) :
ఇక నుంచి ఏడాదికి 12 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. సబ్సిడీ సిలిండర్లను పెంచాలని ఏఐసిసి సమావేశంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానిని కోరిన సంగతి తెలిసిందే. మరో వైపు ఆధార్ కార్డుకు లింకు పెట్టి నగదు బదిలీ పథకం ద్వారా సిలిండర్ రాయితీని జమ చేస్తున్నారు. కేవలం రానున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకే సబ్సిడీ సిలిండర్ల పెంపు చేసిందని విపక్షాలు పేర్కొంటున్నాయి. మొత్తానికి సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇకపై ఏడాదికి 9 సిలిండర్ల స్థానంలో 12 సిలిండర్లు రాయితీపై ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర మంత్రివర్గం ఈ ప్రతిపాదనను గురువారం అంగీకరించింది. సిలిండర్ల పెంపు వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ. 5 వేల కోట్ల భారం పడనుంది. ప్రస్తుతం ఎల్పీజీ సబ్సిడీ విూద ఏటా ప్రభుత్వం రూ. 46 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ప్రభుత్వం తొలుత 2012 సెప్టెంబరులో రాయితీ సిలిండర్ల సంఖ్యను ఆరుకు కుదించింది. జనవరి 2013లో రాయితీ సిలిండర్ల సంఖ్యను 9కి పెంచింది. అయితే ప్రజల సంక్షేమాన్‌ఇన దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నామని పెట్రోలియం శాఖమంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. భారమైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోక తప్పలేదన్నారు. విభజన బిల్లు తిరస్కార తీర్మానంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేని కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు వీరప్పమెయిలీ అభిప్రాయపడ్డారు. అలాగే సబ్సిడీ సిలిండర్లను 99 శాతం మంది వినియోగదారులు పొందుతున్నందున దీనికి ఆధార్‌తో అనుసంధానాన్ని రద్దు చేస్తున్నామని మొయిలీ తెలిపారు. వినియోగదారులకు సబ్సిడీ సిలిండర్లకు సంబంధించిన సబ్సిడీ మొత్తాన్ని బ్యాంకుల ద్వారా నగదు బదిలీలో తలెత్తుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఆధార్‌తో అనుసంధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన తిరస్కార తీర్మానం తెలంగాణ ఏర్పాటుకు అడ్డంకి కాబోదని విూడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ ముసాయిదాపై ఆంధప్రదేశ్ అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే కోరామని తెలిపారు. ఓటింగ్ గాని, తీర్మానం గాని కోరలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుకు సవరణలు చేసి పార్లమెంట్‌లో పెడతామని వీరప్ప మెయిలీ తెలిపారు. అసెంబ్లీ తెలంగాణ బిల్లు ఓడిపోలేదని ఆంధప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.
ఏడాదికి 12 సిలిండర్లు





