Monday, 2 November 2026

తీర్మానం అర్థం లేని ముచ్చట


తెలంగాణ అల్లదిగో : జానా, శ్రీధర్‌బాబు
హైదరాబాద్‌, జనవరి 30 (జనంసాక్షి) :
రాష్ట్ర అసెంబ్లీలో మూజువాణి ఓటుతో నెగ్గినట్టు చెప్తోన్న ముఖ్యమంత్రి తీర్మానానికి అసలు విలువే లేదని రాష్ట్ర మంత్రి జానారెడ్డి అన్నారు. శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఓటింగ్‌ జరగలేదని, మూజువాణిలో ఎవరూ అభిప్రాయాలను తెలపలేదని పేర్కొన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టిన తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని, కంటి తుడుపే చర్యేనని అన్నారు. ఈ తీర్మానాన్ని ఏ చట్ట సభా అంగీకరించదని, రాజ్యాంగం కూడా అంగీకరించదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై జానారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సిఎం తీర్మానం అర్థం లేనిది, విలువలేనిదని జానారెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చ ముగిసిపోయినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. శాసనసభలో తెలంగాణ బిల్లుపై చర్చ పూర్తవడం ఆనందదాయకమని జానారెడ్డి అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ…ఆర్టికల్‌ 3 ప్రకారం అసెంబ్లీలో అభిప్రాయం మాత్రమే చెప్పాలని ఎప్పటికప్పుడు గుర్తు చేశామన్నారు. సీఎం తీర్మానం రాజ్యాంగ విరుద్ధం, అది కంటి తుడుపు చర్యగా అభివర్ణించారు. సీఎం చర్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. సీఎం డ్రామా ముగిసిందని తెలిపారు. ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టికల్‌ 3 ప్రకారం సభలో అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని తాము ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నామని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని రెండు ప్రాంతాల ప్రజలు ఆందోళనలో ఉన్నారని, నాయకులు తమ వ్యాఖ్యలతో ఇంకా గందరగోళం సృష్టించొద్దని కోరారు. అనివార్యమైన రాష్ట్ర విభజనను అడ్డుకోకుండా.. సీమాంధ్ర నాయకులు కేంద్రం నిర్ణయాన్ని గౌరవించాలని సూచించారు. తమ ప్రాంత ప్రజల సమస్యలను సభలో చర్చించివుంటే బాగుండేదని సీమాంధ్ర ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పార్లమెంటులో సీమాంధ్ర సభ్యులు తమ ప్రాంత సమస్యలను వివరించాలని సూచించారు. తెలంగాణ ప్రజలు ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తెలంగాణ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రజలకు, విద్యార్థులకు, యువకులకు తెలియజేస్తున్నట్లు తెలిపారు. సంయమనం పాటించి మనం ఆశించిన తెలంగాణ రాష్టాన్న్రి సాధించుకుందామని జానారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్టాన్న్రి ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఎందుకూ పనికి రాదని రాష్ట్రమంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. వారం రోజుల్లో పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టడం తథ్యమని, తెలంగాణ రావడమూ తథ్యమని ఆయన అన్నారు. పార్లమెంటులో చేయాల్సిన తీర్మానం అసెంబ్లీలో చేస్తే ఎలా అని ప్రశ్నించారు. సీఎం తీర్మానం ప్రభుత్వ తీర్మానం కాదని, దాన్ని పరిగణలోకి తీసుకోవద్దని స్పీకర్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ చెప్పినట్లుగా తెలంగాణ పక్రియ వేగంగా జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర శాసనసభ నుంచి వెళ్లిన ముసాయిదా బిల్లును వారంలోగా పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరుగుతుందని శ్రీధర్‌ బాబు తెలిపారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ ముగిసిందని స్పీకర్‌ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బిల్లుకు పార్లమెంటు ఆమోదం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *