గాంధీనగర్ : బిజెపి పార్లమెంటరీ బోర్డు ఈనెల 17వ తేదీన న్యూఢిల్లీలో సమావేశమవుతుందని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి – బిజెపి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసంలో మూడు గంటల పాటు జరిగిన కోర్ గ్రూప్ నేతల సమావేశంలో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్ బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. సాధ్యమైనంత త్వరగా బిజెపి పార్లమెంటరీ పార్టీ నేతగా, ఎన్డీఏ కూటమి నేతగా నరేంద్ర మోడీని ఎన్నుకునేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకే లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుసటి రోజునే పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.‘‘ఈనెల 17వ తేదీన నరేంద్ర భాయ్‌ను ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించా, లాంఛనంగా బిజెపి పార్లమెంటరీ నేతగా మోడీని ఎన్నుకునేందుకు సాధ్యమైనంత తొందరగా తేదీ ఖరారు చేయడానికి పార్లమెంటరీ బోర్డు సమావేశం ఏర్పాటు చేశా’నని చెప్పారు. పార్టీలో ఎటువంటి విభేదాల్లేవన్న రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కొత్త ప్రభుత్వంలో పార్టీ సీనియర్ల పాత్రపై కూడా చర్చిస్తామని తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ వారసుడెవ్వరన్న విషయం కూడా పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలోనే నిర్ణయిస్తామని తెలిపారు. రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు మోడీ, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ కూడా పాల్గొన్నారు.
Related