
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
హైదరాబాద్/విశాఖపట్నం, అక్టోబర్ 15 (జనంసాక్షి) : కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాలో ఈ నెల 19న పర్యటించనున్నారు. హుదూద్ తుఫానుతో అల్లకల్లోలమైన విశాఖపట్నంలో పరిస్థితిని ఆయన తెలుసుకోనున్నారు. నేరుగా ఢిల్లీ నుంచి వచ్చి, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన తిరుగుతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారమే విశాఖలో పర్యటించి, తక్షణ సాయంగా వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించిన విషయం తెలిసిందే. హుదూద్ తుఫాను సరిగ్గా గత ఆదివారం నాడు.. అంటే ఈనెల 12వ తేదీన తీరందాటింది. వారం రోజులకు అంటే మళ్లీ ఆదివారంనాడు రాహుల్ గాంధీ విశాఖకు వస్తున్నారు. ఆంధప్రదేశ్ రాష్టాన్రికి తుపాను విపత్తు రావడం బాధాకరంగా ఉందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్‌గాంధీ పర్యటిస్తారని దిగ్విజయ్ తెలిపారు. ఈ నెల 19న ఏపీలో, 20న ఒడిశాలో రాహుల్ పర్యటన ఉంటుందని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు పెంచాలన్నారు.




