Tuesday, 3 November 2026

ఫలాలు అర్హులకే

5
వదంతులు నమ్మవద్దు

కరెంటు కష్టాలు బాబు పుణ్యమే

ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 15 (జనంసాక్షి) : సంక్షేమ పథకాలు అర్హులకే అందజేస్తామని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. ప్రజలు వదంతులు నమ్మవద్దని సూచించారు. తెలంగాణ ప్రజలకు కరెంటు కష్టాలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుణ్యమేనని విమర్శించారు. కార్డుల ఏరివేతపై వస్తున్న వార్తలు నిజం కాదని స్పష్టంచేశారు. అర్హులకే ప్రభుత్వ ఫలాలు అందించేందుకు కృషి చేస్తామని.. ఇచ్చిన ప్రతి హావిూని ఆచరణలో పెడతామని చెప్పారు. మంత్రి ఈటెల రాజేందర్‌ బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో భయంకరమైన కరువు నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఖరీఫ్‌లో సరైన వర్షాలు పడలేదని, దీనికి తోడు విద్యుత్‌ సంక్షోభం నెలకొందని చెప్పారు. పంటలు కాపాడేందుకు అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. విభజన చట్టం ప్రకారం రాష్టాన్రికి 54 శాతం విద్యుత్‌ ఇవ్వాల్సి ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రల వల్ల ఆ మేరకు విద్యుత్‌ రావడంలేదని మండిపడ్డారు. అందువల్లే తెలంగాణలో విద్యుత్‌ సమస్య ఏర్పడిందని చెప్పారు. 2017నాటికి మిగులు విద్యుత్తు సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. కరెంటు కొరతపై ప్రతిపక్షాలు చౌకబారు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రెండు రాష్టాల్రు రెండు కళ్లని చెప్పిన చంద్రబాబు.. తెలంగాణకు కరెంట్‌ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో కరెంట్‌ సమస్యలు తీరతాయని, ఈ విషయాన్ని రైతులు ఆర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రజల్లో ఆందోళన అక్కర్లేదన్నారు. కార్డుల ఏరివేతపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ప్రజలు బ్రోకర్ల మాటలు నమ్మవద్దని కోరారు. కొత్త కార్డులు ఇచ్చే వరకు పాత కార్డులపైనే బియ్యం ఇస్తామని చెప్పారు. ఆహార భద్రత కార్డు కోసం తెల్ల కాగితంపై కుటుంబ వివరాలు రాసి ఇస్తే సరిపోతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *