ప్రోరోగ్ కుదరదు
శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, నవంబర్ 25 (జనంసాక్షి) :
డిసెంబర్ 20లోగా అసెంబ్లీ సమావేశం కావాల్సిందేనని, ఈ మధ్యలో ప్రోరోగ్ అంటూ రాద్దాంతం చేయడం తగదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి అసెంబ్లీని ప్రోరోగ్ చేయాల్సిన అవసరం లేదని శ్రీధర్‌బాబు మరోమారు అభిప్రాయపడ్డారు. సోమవారం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రోరోగ్ ఫైల్ తన కార్యాలయానికి వచ్చినట్టు సమాచారం ఉందని ఆయన తెలిపారు. కాగా, తాను ఆ ఫైల్ ఇంతవరకూ చూడలేదన్నారు. రాష్ట్ర విభజనపై అసెంబ్లీని ప్రోరోగ్ పరచాల్సిన అవసరం లేదన్నారు. ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్న తరుణంలో ఇప్పుడు ప్రోరోగ్‌పై ఎందుకు పట్టుబట్టాలన్నారు. అసెంబ్లీ సమావేశం కావడానికి ఇప్పటికిప్పుడు కొంపలు మునిగే ఆర్డినెన్స్‌లు ఏమీ లేవన్నారు. వచ్చే నెల 20లోగా అసెంబ్లీ కచ్చితంగా భేటీ అవుతుందని తెలిపారు. రాయల తెలంగాణ కోసం తనకెలాంటి ఫోన్ కాల్స్ రాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొన్నిఆర్డినెన్స్‌లు జారీ చేయాలంటే అసెంబ్లీని ప్రోరోగ్ పరచాలంటూ సీఎం కార్యాలయం స్పీకర్‌కు ఓ లేఖ పంపిన విషయం తెలిసిందే.
డిసెంబర్ 20లోగా అసెంబ్లీ సమావేశం కావాల్సిందే




