Tuesday, 3 November 2026

రాయల తెలంగాణ ప్రజల డిమాండ్‌ కాదు

పది జిల్లాల తెలంగాణే : కోదండరామ్‌
హైదరాబాద్‌, నవంబర్‌ 25 (జనంసాక్షి) :
రాయల తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ కాదని, అది కేవలం తెలంగాణ అంశాన్ని సాగదీయడానికి సీమాంధ్ర నాయకులు చేస్తున్న డిమాండ్‌ అని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పేర్కొన్నారు. భద్రాచలం, మునగాల మనవి అనే నినాదంతో ఓయూ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పున్నా కైలాశ్‌ నల్లగొండ పట్టణంలోని క్లాక్‌ టవర్‌వద్ద సోమవారం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను కోదండరామ్‌, బీజేపీ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి సందర్శించి కైలాశ్‌కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ, హైదరాబాద్‌ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన రాష్ట్రాన్ని మాత్రమే తెలంగాణ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారని తెలిపారు. అనాదిగా భద్రాచలం, మునగాల ప్రాంతాలు తెలంగాణలోనే ఉన్నాయని నాయకులు తెలిపారు. తెలంగాణ అంశాన్ని జాప్యం చేయాలనుకుంటున్న సీమాంధ్రనాయకులు కొత్త విషయాలను తెరపైకి తెస్తున్నారని కోదండరామ్‌ ఆరోపించారు. రాయల తెలంగాణపై కేంద్రానికి చెందిన ఇంటలెజిన్స్‌ బ్యూరో అధికారులు ఫోన్లు సమాచారం సేకరించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఐబీ తన పని తాను చేసుకోకుండా ఎమ్మెల్యేలతో ఫోన్లలో చర్చలు జరపడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. రాయల తెలంగాణను అటు రాయలసీమ జిల్లాల ప్రజలు కూడా కోరుకోవడం లేదన్నారు. రాయలసీమ నాలుగు జిల్లాల ప్రజలది ప్రత్యేక జీవనశైలి అని, వాటిలో రెండు జిల్లాలను విడదీయడం వారి ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *