
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) :
భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించే విధంగా వ్వవహరించిన లగడపాటి సహా 21 మంది ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులపై దేశద్రోహం, తదితర కేసులు నమోదు చేయాలని కోరుతూ బీహార్ రాష్ట్రం ముజఫర్‌పూర్ జిల్లాలోని ఓ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. సదరు ఎంపీలపై ఐపీసీలోని 504, 323,124బి, 308,120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని స్థానిక న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (సిజెఎం) ఎస్‌పి సింగ్ ముందు ఈ పిటిషన్ దాఖలు చేశారు. మరో ముగ్గురిని కూడా ఈ కేసులో చేశారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన లగడపాటి పెప్పర్ స్ప్రే చల్లడం ద్వారా భారత ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చి పెట్టారని పిటిషనర్ వాదించారు. భారత్, భారతీయ ప్రజాస్వామ్యానికి ఉన్న గుర్తింపు మరింత పెంపొందించడానికి బదులుగా ఈ పార్లమెంట్ సభ్యులు అనుసరించిన వ్వవహార శైలి పార్లమెంటరీ వ్వవస్థను చూసి సిగ్గుపడేలా చేశారని పిటిషనర్ తన పిటిషర్‌లో తెలిపారు. తనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సభ్యులపై భౌతిక దాడికి దిగడంతో పాటు పెప్పర్ స్ప్రే చల్లడం, స్పీకర్, లోక్ సభ సెక్రటరీ జనరల్ టేబుల్‌పై ఫర్నీచర్ ధ్వంసం చేయడం వంటి ఘటనలు జరిగాయని పిటిషనర్ తెలిపారు. పార్లమెంట్ ఆవరణలోకి కత్తి తీసుకొచ్చి ప్రదర్శించి సభా గౌరవాన్ని మంట గలిపారని పిటిషనర్ ఆరోపించారు. ఈ ఎంపిల చర్చలు దేశ ప్రజల మనోభావాలను కించ పరిచాయని పిటిషనర్ తెలిపారు. నేటి దినపత్రికల్లో వచ్చిన కథనాలు చదివితే యావత్ దేశం సిగ్గు పడుతోందని పిటిషనర్ తెలిపారు. కనుక తలవంపులు తెచ్చిపెట్టే ఈ ఘటనను నేరంగా భావించి వారికి దేశద్రోహ నేరం కింద సమన్లు జారీ చేయాలని పిటిషనర్, జడ్జిని కోరారు. కాగా చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఈ కేసు తదుపరి విచారణను వచ్చేనెల ఏడవతేదీకి వాయిదా వేసినట్లు ప్రకటించి మేజిస్ట్రేట్ వెళ్లిపోయారు.
లగడపాటి సహా 21 మంది ఎంపీలపై దేశద్రోహం కేసు




