Wednesday, 4 November 2026

రాజీనామా విసిరికొట్టిన కేజ్రీవాల్‌


జన్‌ లోక్‌పాల్‌కు భాజపా, కాంగ్రెస్‌ నో
ముగిసిన 49 రోజుల ప్రస్థానం
మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్తాం
కాంగ్రెస్‌, బీజేపీ వైఖరిపై విరుచుకుపడ్డ ఆమ్‌ ఆద్మీ చీఫ్‌
లెఫ్ట్ట్‌నెంట్‌ గవర్నర్‌కు రాజీనామా సమర్పణ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) :
రాజకీయాల్లో వేళ్లూనుకుపోయిన కుళ్లును కడిగి పారేసేందుకు రాజకీయ నాయకుడి అవతారమెత్తిన ఆమ్‌ ఆద్మీ అరవింద్‌ కేజ్రీవాల్‌ తన రాజీనామాను విసిరికొట్టారు. 49 రోజుల క్రితం కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో ఢిల్లీ పీఠం అధిరోహించిన సామాన్యుడు తన ప్రస్థానాన్ని ముగించాడు. పాలనలో జవాబుదారీతనం తీసుకువచ్చేందుకు సీఎం సహా మంత్రులందరినీ జన్‌ లోక్‌పాల్‌ పరిధిలోకి తీసుకువచ్చే బిల్లుకు కాంగ్రెస్‌, బీజేపీలు మద్దతు పలకకపోవడంతో కేజ్రీవాల్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. జన్‌ లోక్‌పాల్‌ బిల్లు శాసనసభలో వీగిపోవడంతో మనస్థాపం చెందిన కేజ్రీవాల్‌ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. అదేవిధంగా శాసనసభ రద్దుకు కూడా సిఫార్సు చేశారు. శాసనసభలో జన్‌ లోక్‌పాల్‌ బిల్లు ప్రవేశపెట్టాలా? వద్దా? అన్న అంశంపై శుక్రవారం స్పీకర్‌ నిర్వహించిన ఓటింగ్‌లో 42 మంది సభ్యులు వ్యతిరేకంగా, 27 మంది అనుకూలంగా ఓటేయడంతో బిల్లు వీగిపోయింది. బిల్లుకు ఇతర పార్టీలు మద్దతివ్వకపోతే రాజీనామా చేస్తానని ఇది వరకే ప్రకటించిన కేజ్రీవాల్‌ అన్నమాట ప్రకారమే రాజీనామా సమర్పించారు. రాజ్యాంగం ప్రకారమే తాను నడుచుకుంటానని తెలిపారు. కేంద్రం ఒకప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వంలా, గవర్నర్‌ వైస్రాయిలా భావించుకుంటున్నారని కేజ్రీవాల్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీలు శాసనసభ, పార్లమెంట్‌ను అవమానించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీపై తమ ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినందుకే బిల్లు ప్రవేశపెట్టకుండా ఆ పార్టీలు అసెంబ్లీలో అడ్డుతగిలాయని అన్నారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా కాంగ్రెస్‌, బీజేపీ చేతులు కలిపాయన్నారు. యూపీఏ ప్రభుత్వం, గుజరాత్‌ ప్రభుత్వం ముఖేశ్‌ కనుసన్నల్లోనే నడుస్తున్నాయని అన్నారు. అంతకుముందు శుక్రవారం తీవ్ర గందరగోళం మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ జన్‌లోక్‌పాల్‌ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. స్పీకర్‌కు లెప్టినెంట్‌ గవర్నర్‌ రాసిన లేఖపై ఓటింగ్‌ నిర్వహించాలని కాంగ్రెస్‌, బీజేపీ సభ్యులు పట్టుపట్టారు. జన్‌లోక్‌పాల్‌ బిల్లుపై చర్చించాలని కేజ్రీవాల్‌ విపక్షాలకు సూచించారు. అయితే తీవ్రగందరగోళం మధ్య బిల్లును ప్రవేవ పెట్టడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఢిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌ స్పీకర్‌కు రాసిన లేఖ గురించి చర్చించడానికి అసెంబ్లీ స్పీకర్‌ అన్ని పార్టీలను సమావేశానికి ఆహ్వానించారు. జన్‌లోక్‌పాల్‌ బిల్లుపై నజీబ్‌ జంగ్‌ రాసిన లేఖను సభలో చదవాల్సిందిగా బిజెపి సభ్యులు డిమాండ్‌ చేశారు. కానీ స్పీకర్‌ ఆ లేఖను సభలో చదవడానికి నిరాకరించి, సభను 20 నిమిషాలు వాయిదా వేశారు. జన్‌లోక్‌పాల్‌ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టవద్దని గవర్నర్‌ జంగ్‌ స్పీకర్‌కు లేఖ రాసిన విషయం విదితమే. జన్‌లోక్‌పాల్‌ బిల్లుకు శాసనసభలో ఆమోదం లభించకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ కుండబద్దలు కొట్టారు. శుక్రవారం సభలో బిల్లును ప్రవేశ పెట్టారు. వెంటనే స్పీకర్‌ చర్చకు అనుమతించారు. మరోవైపు కేంద్రమంత్రి మొయిలీ, రిలయన్స్‌ అధినేత అంబానీలపై కేసు పెట్టడం ద్వారా కేజ్రీవాల్‌ దూకుడు పెంచారు. దీంతో ఆయన పదవికి ఎసరు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్టపికే గుర్రుగా ఉన్న కాంగ్రెస్‌ ఈ విసయంలో మద్దతు తెలిపే అవకాశాలు లేవు. జన్‌లోక్‌పాల్‌ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేజ్రీవాల్‌ తన మైనారిటీ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఇలా కలిసికట్టుగా వ్యవహరించడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారని అన్నారు. ఈ రెండు పార్టీలు అత్యంత సమన్వయంతో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తాము కోరుకున్నది కూడా ఇదేనని, రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని అన్నారు. ఈ రెండు పార్టీలు ఈవిధంగా వ్యవహరించడానికి కారణం ఓ భారీ వ్యాపార సంస్థపై తాము చర్యలకు ఉపక్రమించడమే ఇందుకు కారణమన్నారు. అందుకే ఈ రెండు పార్టీలు తమ విషయంలో దుందుడుకుగా వ్యవహరిస్తున్నాయన్నారు. సభా కార్యకలాపాలు జరగబోవని, ఇందుకు కారణం ఎటువంటి కార్యకలాపాలు జరగకుండా అడ్డుకోవాలని నిర్ణయించు కోవడమేనన్నారు. జన్‌లోక్‌పాల్‌ బిల్లు, స్వరాజ్‌ బిల్లుల ఆమోదంకోసం ఆప్‌ సర్కారు అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) అనుమతి లేకుండా స్పీకర్‌ బిల్లును సభలో ప్రవేశపెట్టనివ్వకూడదన్న అభ్యంతరాలపై స్పందిస్తూ ప్రభుత్వం దానిని సభలో ప్రవేశపెట్టొచ్చని అన్నారు. దీంతో 49 రోజుల ఆమ్‌ ఆద్మీ పార్టీ పాలనకు తెరపడింది. మళ్లీ ఢిల్లీ ప్రజలు అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి నెలకొంది. కార్పొరేట్‌ శక్తుల కుట్రలు, బీజేపీ, కాంగ్రెస్‌ దిగజారుడు రాజకీయాలపై తమ పార్టీ మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్తోందని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *