Tuesday, 3 November 2026

లక్ష కోట్లతో తెలంగాణ అభివృద్ధి


గిరిజనులు, దళితులకే పెద్దపీట : కేసీఆర్‌

హైదరాబాద్‌, మార్చి 7 (జనంసాక్షి) :

లక్ష కోట్లతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంతో పాటు రాజ్యాధికారం మన చేతుల్లో ఉంటేనే ఇచ్చిన హామీలను నెరవేర్చుకోగలుగుతామని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. తన జీవితానికి తెలంగాణ సాధించిన తృప్తి చాలని, అయితే చిరునవ్వుల తెలంగాణ కోసం ఇంకా ఉద్యమించాల్సిందేనని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా అధికారం దక్కించుకునేందుకు అందరూ ఉద్యమించాలని అన్నారు. మాయామశ్చీంద్రల మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. తెలంగాణ  కోసం ఎవరు ఎలాంటి ఉద్యమాలు చేశారో తెలియంది కాదన్నారు. తెలంగాణలో గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెరాస అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తిస్తామన్నారు. వాటితో పాటు చెంచు, కోయ తండాలను కూడా ప్రత్యేక పంచాయతీలుగా చేసి అభివృద్ధి చేస్తామని, వారి గిరిజన సంస్కృతిని కాపడుతామని హామీ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రంలో గిరిజన సంస్కృతి ఔన్నత్యం కాపాడతామన్నారు. వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ టీడీపీ ఇన్‌చార్జి నెహ్రునాయక్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. కేసీఆర్‌ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర విభజన చట్టమైపోయిందని ఇక ఇప్పుడు దాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనను ఆపుతామంటూ సీమాంధ్ర నేతలు ఇంకా మభ్యపెడుతున్నారని విమర్శించారు. జేజమ్మలు దిగొచ్చిన తెలంగాణ ఆగదని పేర్కొన్నారు. 14 ఏళ్లు ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. అయితే సమస్యలు అలాగే ఉన్నాయని వాటిని పరిష్కరించుకుందామని అన్నారు. ఇకపై తెలంగాణ ప్రజలు ఉద్యమస్ఫూర్తితో పునర్నిర్మాణానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. చిరునవ్వుల తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తా అని అన్నారు. దీనికోసం  నిరుద్యోగులు, రైతులు ఎంతో ఆశతో ఎదిరి చూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉపయోగపడేది గిరిజన, దళితులేనని కేసీఆర్‌ అన్నారు. గిరిజనులకు ప్రత్యేక సంస్కృతి ఉందని, వాళ్లకు ప్రతి రంగంలో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోయ, గొండు, చెంచు గూడాలను గ్రామపంచాయతీలుగా గుర్తిస్తామన్నారు. ఎస్సీలకు ఏడున్నర వేల కోట్ల రూపాయలను కేటాయిస్తామని వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఇన్నాళ్లూ ఉద్యమించామని, ఇప్పుడు ఇక సాధించుకున్న రాష్ట్రం పునర్నిర్మాణానికి ఉద్యమిద్దామని పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంతో పని అయిపోలేదని, బంగారు తెలంగాణను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రంపై కోటానుకోట్ల ఆశలున్నాయని, రాష్ట్రం కోసం ఉద్యమించి సాధించుకున్నామని, ఇప్పుడు పునర్నిర్మాణ ఉద్యమం మొదలుపెడదామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పటిష్ఠమైన నాయకత్వం కావాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పరిపాలన యంత్రాంగం రోజుకు 24 గంటలపాటు పనిచేసినా సరిపోదని అన్నారు. దళితుల్లో ప్రతి కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామని, బ్జడెట్‌లో ప్రతి సంవత్సరం రూ.10వేల కోట్లు కేటాయించి వారికే ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో బడ్జెట్‌ లక్షకోట్లు ఉండబోతోందని అన్నారు. దళితులకు కేటాయించిన బడ్జెట్‌ వారికే ఖర్చుపెట్టి వారికి ప్రత్యేక అధికారులను కేటాయించి అమలు చేస్తామన్నారు. ఇందుకోసం తాను విశ్రమించకుండా పని చేస్తానన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి జరగాలని, బలిసిన వారి కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేమని అన్నారు. ఇవన్నీ సాధించడానికి పటిష్టమైన ప్రభుత్వం, పటిష్ఠమైన నాయకుడు అవసరమన్నారు. తాను గడిచిన 15 సంవత్సరాలుగా ఉద్యమబాటలో నడుస్తున్నానని అన్నారు. తెలంగాణ ప్రజలు ఆంధ్ర పార్టీల నాయకత్వాలను కోరుకోవడం లేదని, తెలంగాణ ప్రాంత నేతలు ఇంకెందుకు టీడీపీలో ఉంటున్నారని, కట్టకట్టుకొని బయటకు రావాలని అన్నారు. తెలంగాణలో ఇంకా సీమాంధ్ర పాలన అవసరమా అని అన్నారు. ఎవరెవరో పార్టీలు పెడతామని వస్తున్నారని వారిని నమ్మొద్దన్నారు. పవన్‌ కళ్యాణ్‌ గురించి నాకు తెలియదని, ఎవరని అడిగితే చిరంజీవి తమ్ముడని అన్నారని అన్నారు. అన్నది అయిపోయింది ఇక తమ్ముడిదా అంటూ ఎద్దేవా చేశారు. ఎవరినీ నమ్మకుండా మన తెలంగాణను మనమే నిర్మించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో కడియం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *