Monday, 2 November 2026

పీఎస్‌ఎల్వీ సీ-24 కౌంట్‌డౌన్‌ షురూ


శ్రీహరికోట, ఏప్రిల్‌ 2 (జనంసాక్షి) :
పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌ సీ-24 ప్రయోగానికి కౌంట్‌ డౌన్‌ షురువైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌థావన్‌ అంతరిక్ష కేంద్రంలో (షార్‌) పీఎస్‌ఎల్‌వీ-సీ24 రాకెట్‌ ప్రయో గానికి బుధవారం ఉదయం కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. 4వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు రాకెట్‌ ప్రయోగం జరపను న్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో దేశంలో నావిగేషన్‌ సిస్టమ్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ఇస్తో శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు.ఇందులో భాగంగా మంగళవారం షార్‌లో మిష న్‌ రెడీనెస్‌ రివ్యూ (ఎంఆర్‌ఆర్‌), లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ఎల్‌ఏబీ) సమావేశాలు జరిగాయి. ఎంఆర్‌ఆర్‌
చైర్మన్‌ డాక్టర్‌ బీఎన్‌.సురేష్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రయోగానికి రాకెట్‌ సిద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం షార్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో ల్యాబ్‌ సమావేశం జరిగింది. అలాగే మంగళవారం షార్‌ జీరో పాయింట్‌లోని మిషన్‌ కంట్రోల్‌ సెంట్రల్‌ నుంచి సన్నాహక ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. కాగా, స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థకు ఉపయోగపడే ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1బీ ఉపగ్రహంతో 4న రాకెట్‌ నింగిలోకి దూసుకుపోనుంది. కౌంట్‌డౌన్‌ సమయంలో మొదట నాలుగోదశలోని మోటారుకు 2.5 టన్నుల ద్రవ ఇంధనం, రెండో దశలోని మోటారుకు 41.7 టన్నుల ద్రవ ఇంధనం నింపనున్నారు. ఆ తర్వాత ఘన ఇంధనంతో ఉన్న మొదటి దశ మోటారు చుట్టూ అమర్చిన 6 స్ట్రాపాన్‌ మోటార్లలో ద్రవ ఇంధనం నింపి రాకెట్‌ను ప్రయోగానికి సిద్ధపరచనున్నారు. ప్రయోగానికి కొద్ది గంటలముందు రాకెట్‌లోని ఎలక్ట్రానిక్‌ పరికరాలకు తుది పరీక్షలు నిర్వహించి గంట ముందు రాకెట్‌ను సూపర్‌ కంప్యూటర్‌ అధీనంలోకి తీసుకువెళ్లనున్నారు. కౌంట్‌డౌన్‌ జీరోకు చేరుకున్న తర్వాత సూపర్‌కంప్యూటర్‌ రాకెట్‌ ప్రయోగాన్ని నిర్వహించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *