Tuesday, 3 November 2026

28న వీఆర్వో, వీఆర్‌ఏ భర్తీ నోటిఫికేషన్‌

– మంత్రి రఘువీరా
హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి) :
వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి ఈనెల 28న జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేస్తారని రెవెన్యూమంత్రి మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరి రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత రఘువీరా విలేకరులతో మాట్లాడారు. 1,657 వీఆర్‌వో, 4,305 వీఆర్‌ఏ పోస్టుల భర్తీ పక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తవుతుందని చెప్పారు. దీనికి సంబంధించి జనవరి 13 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరిస్తామని చెప్పారు. జనవరి 19 నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఫిబ్రవరి 2న ఉదయం వీఆర్‌ఓ, మధ్యాహ్నం వీఆర్‌ఏ పోస్టులకు అన్ని జిల్లాల్లో ఏకకాలంలో పరీక్ష జరుగుతుందని చెప్పారు. ఫిబ్రవరి 4న ప్రాథమిక కీ ను, ఫిబ్రవరి 9న ఫైనల్‌ కీ విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 20న పరీక్ష ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు. ఫిబ్రవరి 26 నుంచి సర్టిఫికెట్‌ పరిశీలన జరుగుతుందని, ఫిబ్రవరి నెలాఖరు వరకు పోస్టుల భర్తీ పక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుందని అన్నారు. ఎటువంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా పరీక్ష నిర్వహిస్తామని అభ్యర్థులు దళారులను ఆశ్రయించవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం సచివాలయం నుంచి మంత్రి రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈసేవా, మీ సేవా, ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు లభ్యమవుతాయని, జనవరి 12 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *