Tuesday, 3 November 2026

30 మంది ఎమ్మెల్యేలు.. ముగ్గురు మంత్రులు గోడ దూకొచ్చు

స్వార్థ రాజకీయాల కోసమే పార్టీ ఫిరాయిస్తారు
జేసీకి మరో షోకాజ్‌ పంపుతాం : బొత్స
హైదరాబాద్‌, డిసెంబర్‌ 27 (జనంసాక్షి) :
30 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులు పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని, స్వార్థ రాజకీయాల కోసమే వారి కప్పదాట్లని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీ అధిష్టానాన్ని ఎవరు ధిక్కరించినా చర్యలు తీసుకుంటామని, క్రమశిక్షణ ఉల్లఘించేవారిని ఉపేక్షించబోమని ప్రదేశ్‌ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీలో ఉంటూ నష్టం చేసే వారు వందమంది ఉన్నా వేస్టేనని శుక్రవారం అన్నారు. ఆయన గాంధీ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించిన చర్యలు తప్పవన్నారు. మాజీ మంత్రి, పార్టీ సీనియర్‌ శాసన సభ్యులు జెసి దివాకర్‌ రెడ్డి ఇచ్చే వివరణ ఆధారంగా తాము ఆయనపై చర్యలు తీసుకుంటామన్నారు. ఊసరవెల్లి రాజకీయాలు చేసే వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. పార్టీని వదిలి వెళ్లే వారి జాబితా జిల్లా శాఖల వద్ద ఉందన్నారు. పార్టీ నుండి ఎవరు వెళ్లినా నష్టమేనని అయితే, పార్టీలో ఉంటూ నష్టం కలిగించే వారు వందమంది ఉన్నా వృథానే అన్నారు. 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని బొత్స సత్యనారాయణ తెలిపారు. తమవద్ద సమాచారం ఉందని వారిలో ఇద్దరు, ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారన్నారు. అవసరం అయినప్పుడు వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉసరవెల్లి రాజకీయాలు చేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. పక్క పార్టీల వైపు చూసేవారి జాబితా పీసీసీ దగ్గర ఉందని బొత్స అన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘనతో పాటు కాంగ్రెస్‌ పార్టీని, హైకమాండ్‌ నాయకత్వాన్ని ఎవరు ధిక్కరించినా చర్యలు తప్పవని బొత్స స్పష్టం చేశారు. జేసీకి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, అయితే నోటీసులు అందలేదని ఆయన అంటున్నారన్నారు. అందుకని ఆయనకు మళ్లీ నోటీసులు పంపిస్తామని బొత్స తెలిపారు. ఎంపీల వ్యవహారం ఏఐసీసీ చూసుకుంటుందన్నారు. ప్రజలలో ఉన్న సెంటిమెంటును ఆసరాగా చేసుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ప్రాంతాల వారీగా తమ వాదనలను వినిపిస్తారన్నారు. విభజనకు సిపిఎం, మజ్లిస్‌ సహా అన్ని పార్టీలు అంగీకరించాయన్నారు. అన్ని పార్టీలు విభజనపై అభిప్రాయం చెప్పాకే తమ పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు కారణమన్నారు. విభజనపై కాంగ్రెసు పార్టీని విమర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తే వారితో పొత్తు పెట్టుకునేందుకు వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీ చూస్తోందన్నారు. 23 తర్వాత రాష్ట్రపతి నిర్ణయం ఇస్తే బిల్లుపై చర్చ జరుగుతుందన్నారు. పాలెం బస్సు ప్రమాదం కేసు బాధ్యత పోలీసులదే అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరగాలనే తామంతా కోరుకుంటున్నామన్నారు. చర్చకు మరింత గడువు పెంచాలని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు బొత్స తెలిపారు. ఎవరైనా హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అన్నారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌ అని బొత్స వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల్లోకి వెళ్లేవారి వివరాలు జిల్లాల వారీగా పీసీసీ వద్ద ఉన్నాయని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *