రామ్‌లీలా మైదానమే వేదిక
సీఎన్‌జీ ధర పెంపుపై కేజ్రీవాల్ గుస్సా
మెట్రో రైల్‌లో ప్రమాణ స్వీకారానికి వెళ్తా
ఫైళ్ల మాయమే గత ప్రభుత్వ అవినీతికి రుజువు : కేజ్రీవాల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 27 (జనంసాక్షి) :
దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సామాన్యుడు, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజీవ్రాల్ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ శనివారం అధికారం చేపట్టనుంది. ఇందుకోసం రామ్‌లీలా మైదానంలో పూర్తి ఏర్పాట్లు చేశారు. కొత్త ప్రభుత్వం రాంలీలా మైదాన్‌లో పదవీ ప్రమాణ స్వీకారాలు చేయనున్నట్లు ఆప్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఢిల్లీ సచివాలయం స్వాగతించడానికి సన్నద్ధమవుతోంది. పూర్వ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రుల పేర్లను తుడిపించి, గదులను శుభ్రం చేయిస్తున్నారు. సెలవుల్లో ఉన్న సిబ్బందిని ఆఘామేఘాల విూద రప్పించి విధుల్లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు కేజీవ్రాల్ సంసిద్ధతను వ్యక్తం చేసిన వెంటనే పాత ప్రభుత్వంలో పదవీ బాధ్యతలు నిర్వహించిన నలుగురు మంత్రుల గదులమీద నేమ్ ప్లేట్లను తొలిగించారు. పాలన విభాగం తక్కిన మంత్రుల గదుల నేమ్ ప్లేట్లను కూడా తొలిగించాలని ఆదేశాలు జారీ చేసింది. 15 సంవత్సరాలు పరిపాలన నిర్వహించిన కాంగ్రెస్ నాయకురాలు ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కాపాలదారులను మార్చడానికి అధికారులు కొంత తత్తరపడినట్లు కనిపించారు. ఇదిలావుంటే కేజ్రీవాల్ ప్రస్థానం అంతా ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. ఉరుకలెత్తుతున్న యువరక్తం అధికారంలోకి రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని కొందరు అధికారులు తెలిపారు. ‘బహుశ మేమంతా ఓ ప్రత్యేక తరహాలో పనిచేయాల్సి వస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ మార్పు సానుకూలంగానే ఉంటుందని భావిస్తున్నాం. మేము పనిచేయడానికి సిద్ధమయ్యే ఉన్నాం. ఆందోళన పడాల్సింది ఏ మాత్రం లేదు అని వారి మనుసులో మాటలను పంచుకున్నారు. కొత్త ప్రభుత్వ అధినేత కేజీవ్రాల్ ఇప్పటికే వివిధ శాఖ వ్యవహారాలను చూస్తున్న అధికారుల వివరాలను సేకరించినట్లు వినికిడి. వారి వారి పనివిధానం, పదవీకాలంలో సాధించిన ఫలితాలను బేరీజు వేసినట్లు భావిస్తున్నారు. వివాదాలు, కుంభకోణాల్లో భాగస్వాములుగా విమర్శలు ఎదుర్కొన్న వారి పేర్ల జాబితాను కూడా సిద్ధం చేసి ఉంచుకున్నట్లు తెలిసింది. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్న అరవింద్ కేజీవ్రాల్.. ఐఐటీలో ఇంజనీరింగ్ చదివారు. ఐఆర్‌ఎస్ అధికారిగా పనిచేసి, దానికి రాజీనామా చేశారు. ప్రజా ఉద్యమాల్లోకి దూకి.. లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారేతో కలిసి భారీ పోరాటం చేశారు. నిర్భయ ఘటన జరిగినా.. మరే సమస్య వచ్చినా తానున్నానంటూ ముందుకు ఉరికారు. ఇతర నాయకుల్లా హంగు, ఆర్భాటాలు లేకుండా.. ప్రతిరోజూ ఇంట్లో తప్పనిసరిగా ఉపయోగించే చీపురుకట్టను తమ ఎన్నికల గుర్తుగా పెట్టుకున్నారు. ఎన్నికల్లో పొలిటికల్ పండితుల అంచనాలను తలదన్ని.. 28 సీట్లు కైవసం చేసుకున్నారు. 1968 ఆగస్టు 16వ తేదీన గోవింద రామ్ కేజీవ్రాల్, గీతాదేవి దంపతులకు హర్యానాలోని హిస్సార్లో అరవింద్ జన్మించారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ పరిధిలో గల కౌశాంబి ప్రాంతంలోని ఓ అపార్టుమెంట్ గ్రౌండ్‌ఫ్లోర్లో ఎ-119 అపార్టుమెంట్లో నివసిస్తున్నారు. హిస్సార్ లోని క్యాంపస్ స్కూల్లో ప్రాథమిక విద్య చదివి, ఆ తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ పూర్తి కాగానే జంషెడ్పూర్లోని టాటా స్టీల్‌స్లో ఉద్యోగంలో చేరారు. తర్వాత సివిల్స్ రాసి ఐఆర్‌ఎస్ అధికారిగా ఎంపికై, ఆదాయపన్ను శాఖలో జాయింట్ కమిషనర్‌గా 1995 నుంచి 2006 వరకు పనిచేశారు. 2000 సంవత్సరంలో పరివర్తన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించారు. సివిల్స్ ఉద్యోగానికి రాజీనామా చేసి 2011లో ‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ బ్యానర్ కింద జనలోక్‌పాల్ బిల్లు కోసం ఉద్యమం మొదలుపెట్టారు. 2012 నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీ పేరుతో రాజకీయ పార్టీ ప్రారంభించారు. 2004లో పౌరసేవలకు గాను అశోక ఫెలోషిప్, 2005లో ప్రభుత్వ పారదర్శకత కోసం పోరాడినందుకు ఎస్కే దూబే స్మారక అవార్డు, 2006లో నాయకత్వ ప్రతిభకు గాను రామన్ మెగసెసె అవార్డు అరవింద్ కేజీవ్రాల్‌ను వరించాయి.
ప్రమాణస్వీకారానికి మెట్రోలో వెళ్తా
ప్రమాణస్వీకారోత్సవానికి మెట్రో రైలులో వెళ్తానని కేజ్రీవాల్ చెప్పారు. మిగతా సభ్యులతో పాటు తాను కూడా కార్యక్రమం జరిగే రామ్‌లీలా మైదానానికి మెట్రోలో వెళ్తానని అన్నారు. ప్రమాణ స్వీకారోత్సవం దగ్గర పడుతోంది, విూరేమైనా ఒత్తిడినెదుర్కొంటున్నారా అన్న విలేకరుల ప్రశ్నకు ‘నా మీద పెద్ద బాధ్యత ఉందని తెలుసు. అయితే కలసికట్టుగా పనిచేస్తే ప్రపంచాన్ని మార్చగల శక్తి వస్తుంది..’ అని అరవింద్ సమాధానమిచ్చారు. శనివారం ప్రమాణ స్వీకారం చేసే కేజీవ్రాల్ వీఐపీ సంస్కృతికి వ్యతిరేకంగా తన కార్యాచరణ మొదలుపెట్టారు. అధికార నివాసాన్ని, భద్రతని తిరస్కరించిన ఆయన ప్రమాణ స్వీకారానికి వీఐపీలెవరూ ఉండరని అందరూ రావచ్చని తెలిపారు. ఇక ఢిల్లీలో సీఎన్‌జీ రేట్ల పెంపుపై ఆమ్‌ఆద్మీ చీఫ్, కాబోయే సీఎం అరవింద్ కేజీవ్రాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు రెండు రోజుల ముందు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని కేజీవ్రాల్ ప్రశ్నించారు. ఇదే విషయంపై కేంద్రాన్ని వివరణ అడుగుతామన్న ఆయన… సీఎన్‌జీ రేట్ల పెంపును నిరసిస్తూ సమ్మెకు దిగుతామన్న ఆటోవాలలతో చర్చిస్తామని చెప్పారు. సమ్మె చేపట్టవద్దని ఆటోవాలాలకు కేజీవ్రాల్ విజ్ఞప్తి చేశారు. సిఎన్‌జి గ్యాస్ ధరలను పెంచడాన్ని కేజ్రీవాల్ తప్పుపట్టారు. దీనిపై బాధ్యతలు చేపట్టాక నిర్ణయం తీసుకుంటామన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో ధరలు పెంచడం సరికాదన్నారు. దీనివల్ల ఆటోవాలలకు భారం పెరగ్గలదన్నారు. జనతా దర్బార్ గురించి విలేకరుల అడగ్గా, పై నుంచి కింది వరకు వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని, అందుకే ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వద్దకు నేరుగా వస్తున్నారని కేజీవ్రాల్ చెప్పారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. ప్రజల అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, వాళ్ల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు తాము కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే దాదాపు 90 శాతం వరకు సమస్యలు స్థానికమేనని, వాటిని ‘మొహల్లా (వీధి) సభ’లతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అప్పుడు ప్రజలు తమ సమస్యలతో కాక.. ఇతర సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వద్దకు వస్తారన్నారు.
అన్నా హజారేకు
కేజీవ్రాల్ ఫోన్
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు ఆయన గురువు అన్నాహజారేతో ఫోన్‌లో మాట్లాడారు. శనివారం జరిగే తన ప్రమాణిస్వీకార కార్యక్రమానికి హాజరుకావలిసిందిగా అన్నాను ఆహ్వానించినట్లు ఆమ్‌ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఒకే లక్ష్యం కోసం కలిసి పోరాటం చేసిన వీరిద్దరి మద్య గత కొంత కాలంగా సబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే అన్నా తప్పకుండా రావాలని కోరినట్లు తెలిపారు. తన ఆరోగ్యం బాగాలేదని, అయినా తనకు ఆహ్వానం అందిన తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లాలా, వద్దా అనే విషయంపై ఆలోచిస్తానని ఇదివరకే అన్నా చెప్పారు. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నుంచి కూడా అన్నాకు ఆహ్వానం అందినట్లు సమాచారం. సామాన్యుని ప్రమాణ స్వీకారానికి అన్నా వెళ్తారో లేదో చూడాలి.
నేడు సామాన్యుడికి పట్టాభిషేకం




