Monday, 2 November 2026

36 బంతుల్లో శతకం

సరికొత్త రికార్టు నెలకొల్పిన అండర్సన్‌
క్వీన్స్‌టౌన్‌, జనవరి 1 (జనంసాక్షి) :
న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ 36 బంతుల్లోనే శతకం బాది నూతన సంవత్సరాన్ని నూతన రికార్డుతో ఆరంభించాడు. న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ మధ్య జరిగిన మూడో వన్డేలో అండర్సన్‌ వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీతో సంచలనం సృష్టించాడు. కేవలం 36 బంతుల్లోనే శతకం సాధించి సరికొత్త రికార్డ్‌ నమోదు చేశాడు. వరుణుడు అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్‌ను 21 ఓవర్లకు కుదించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ ధాటిగా ఆడింది. గుప్తిల్‌, మెక్‌కల్లమ్‌, టేలర్‌ తక్కువ స్కోర్లకే ఔటైనా… జెస్సీ రైడర్‌, ఆండర్సన్‌ చెలరేగి ఆడారు. ఐదోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆండర్సన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్ల వర్షంతో స్టేడియాన్ని ముంచెత్తాడు. ఏ బౌలర్‌నూ వదలకుండా రెచ్చిపోయిన ఆండర్సన్‌ 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించగా మరోవైపు రైడర్‌ కూడా ధాటిగా ఆడడంతో కివీస్‌ రన్‌రేట్‌ ఓవర్‌కు 11 పరుగులకు పైగా సాగింది. హాఫ్‌ సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయిన ఆండర్సన్‌ వరుస సిక్సర్లతో దుమ్మురేపాడు. ఈ క్రమంలో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకూ పాక్‌ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది 37 బంతుల్లోనే శతకం సాధించగా దానిని ఆండర్సన్‌ బ్రేక్‌ చేశాడు. ఆండర్సన్‌ సెంచరీ ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. అటు రైడర్‌ కూడా సెంచరీ సాధించడంతో న్యూజిలాండ్‌ 21 ఓవర్లలోనే 4 వికెట్లకు 283 పరుగులు చేసింది. ఆండర్సన్‌ 47 బంతుల్లో 14 సిక్సర్లు , 6 ఫోర్లతో 131 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రైడర్‌ 101 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత బరిలోకి దిగిన వెస్టిండీస్‌ ఏ దశలోనూ విజయం కోసం ప్రయత్నించలేదు. ఆది నుండే తడబడుతూ 21 ఓవర్లలో 5 వికెట్లకు 124 పరుగులు చేసింది. డ్వయాన్‌ బ్రేవో హాఫ్‌ సెంచరీతో రాణించగా కివీస్‌ 159 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఐదు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆండర్సన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *