– దుమ్ముగూడెంపై సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్,నవంబర్ 11,(జనంసాక్షి): దుమ్ముగూడెం ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. దీనికి అనుగుణంగా రిజర్వాయర్లు, కాలువలు నిర్మించాలన్నారు. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి సవిూక్ష జరిపారు. ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ కాలువ కింద సాగయ్యే భూమిని మినహాయించి, మిగతా భూములకు దుమ్ముగూడెం ప్రాజెక్టు నుంచి నీరందాంచాలని తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. సమైక్య పాలనలో దుమ్ముగూడెం ప్రాజెక్టును ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ లుగా విడగొట్టారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీ ఇంజనీరింగ్ ద్వారా వీటిని కలిపి ఖమ్మం జిల్లాకు నీరందించే కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. గోదావరిలో దుమ్ముగూడెం దగ్గర ఏడాది పొడవునా నీరు సమృద్ధిగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి నీరు ఎత్తిపోయాలని సూచించారు. దుమ్ముగూడెం నుంచి కిన్నెరసాని వరకు గ్రావిటీ ద్వారా నీరు తీసుకొచ్చి, అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా జగన్నాథపురం తరలించాలని చెప్పారు. జగన్నాథపురంలో రిజర్వాయరు కట్టి అక్కడి నుంచి సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాలకు నీరివ్వాలని వివరించారు. రోళ్లపాడు దగ్గర భారీ రిజర్వాయర్ కట్టి ఇల్లందు, వైరా, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాలకు నీరందించాలని ముఖ్యమంత్రి చెప్పారు. బయ్యారం చెరువు సామర్థ్యాన్ని పెంచి ఇల్లందు, వైరా, పాలేరు, ఖమ్మం, వరంగల్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గాలను నీరివ్వాలని సీఎం కేసీఆర్ సూచించారు. సాంకేతిక అంశాలను పరిశీలించి రిజర్వాయర్లు, కాలువలు, లిఫ్ట్ నిర్మాణానికి సూచనలతో నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ ను, రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులను సీఎం కేసీఆర్ కోరారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, ఎంజీ గోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.





